రైతులను దగా చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
నంద్యాల(అర్బన్): రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ఉల్లి రైతులకు పరిహారం అందేలా ప్రభుత్వానికి నివేదికలు పంపాలని కోరుతూ సోమవారం పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ రాజకుమారికి ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డితో కలిసి జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొక్కజొన్న క్వింటా రూ.2400తో కొనుగోలు చేస్తామని, కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు ప్రభుత్వం చెప్పినా నేటికీ ఏర్పాటు చేయలేదన్నారు. రైతులు దళారులకు క్వింటా రూ.1600 నుంచి రూ.1700తో అమ్ముకొని తీవ్రంగా నష్టపోయారన్నారు.
రూ.28కోట్లు ఇవ్వాలి
కడప, కర్నూలు జిల్లా రైతులు సాగు చేసిన ఉల్లి పంటకు పరిహారం అందించిన చంద్రబాబు ప్రభుత్వానికి నంద్యాల జిల్లా ఉల్లి రైతులు కనపడలేదా అని కాటసాని ప్రశ్నించారు. నంద్యాల జిల్లాలో 14వేల ఎకరాల్లో ఉల్లి సాగు అయ్యిందని, పంట నష్టపరిహారం కింద రూ.28కోట్లు రైతులకు రావాల్సి ఉందన్నారు. ఉల్లి రైతులకు నగదు జమ చేయకపోతే రైతుల పక్షాల పోరాటం చేయాల్సి ఉంటుందన్నారు.
నిరాహార దీక్షలు చేస్తాం
ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా మాట్లాడుతూ.. రైతులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. నష్టపోయిన రైతులు ఎక్కడి వారికై నా పరిహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగాల భరత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. నంద్యాల జిల్లా ఉల్లి రైతులకు రావాల్సిన రూ.28 కోట్ల పంట నష్టపరిహారం ప్రభుత్వం అందించకపోతే నిరహార దీక్షలు చేపడుతామన్నారు. వీరి వెంట పాణ్యం మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణరెడ్డి, గడివేముల జెడ్పీటీసీ సభ్యుడు చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు సంఘం నాయకులు మహేశ్వరరెడ్డి ఉన్నారు.
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల
ఏర్పాటు చేయాలి
ఉల్లి రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
కాటసాని రాంభూపాల్‌రెడ్డి


