ఆసరా లేదు.. పింఛన్ ఇవ్వండి!
● జిల్లా కలెక్టర్‌కు అర్జీలు ఇచ్చిన వృద్ధులు, వితంతువులు
నంద్యాల: తనకు 62 ఏళ్ల వయస్సు ఉందని, ఎలాంటి ఆసరా లేదని, చిన్న పని కూడా చేయలేకపోతున్నానని, పింఛన్ ఇవ్వాలని ఆళ్లగడ్డ మండలం మెట్టపల్లె గ్రామానికి చెందిన కె. లక్ష్మీనరసయ్య అర్జీ ఇచ్చారు. తన భర్త అనారోగ్యంతో మృతి చెందారని, తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని ఆళ్లగడ్డ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన ఎం. ఓబులమ్మ వినతి పత్రం అందజేశారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ రాజకుమారి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్జీదారుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అధికారులు మరింత చొరవతో ప్రతి దరఖాస్తును నాణ్యతతో పాటు వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. రీ–ఓపెన్ అయిన దరఖాస్తులు, బియాండ్ ఎస్‌ఎల్‌ఏలో ఉన్న అర్జీలు, వీఐపీ గ్రీవెన్స్ లను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని వెంటనే పరిష్కరించాలన్నారు. పీజీఆర్‌ఎస్‌కు 151 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.


