మంత్రి బీసీ బంధువుల దౌర్జన్యం
● కుమారుడిని చూడటానికి వెళ్లిన వ్యక్తిని బంధించిన వైనం
నంద్యాల: కోర్టు ఉత్తర్వుల మేరకు సొంత కుమారుడిని చూసుకోవడానికి వెళ్లిన వ్యక్తిని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి బంధువులు కొట్టి బంధించారు. ఈ విషయం ఎస్పీకి తెలిపినా మంత్రితో షటిల్ చేసుకోమని చెబుతున్నారని తండ్రి ఆవేదన చెందుతున్నారు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. బేతంచెర్ల మండలం కనకాద్రిపల్లె గ్రామానికి చెందిన మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అల్లుడి అక్క కూతురు మల్లీశ్వరితో కర్నూలుకు చెందిన వెంకటేశ్వరరెడ్డి కుమారుడు తేజారెడ్డితో వివాహం జరిగింది. కొన్ని నెలలుగా కుటుంబ కలహాలతో వేర్వేరుగా ఉంటున్నారు. విడాకుల విషయం కోర్టులో ఉంది. కోర్టు ఉత్తర్వుల మేరకు ప్రతి ఆదివారం కుమారుడిని చూడటానికి తేజారెడ్డికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో తేజారెడ్డి న్యాయవాదితో కలిసి కుమారుడిని చూడటానికి ఆదివారం కనకాద్రిపల్లె గ్రామానికి వెళ్లారు. ఈ సమయంలో మంత్రి బంధువులు తేజారెడ్డిని కొట్టి ఇంట్లో బంధించారు. డబ్బులు ఇవ్వనిది ఇక్కడి నుంచి బయటకు పంపబోమని బెదిరించి నిర్బంధిచారు. విషయం తెలుసుకున్న తేజారెడ్డి తండ్రి తిరుమలేశ్వరరెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సోమవారం కూడా బయటకు రాకపోవడంతో ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం తిరుమశ్వరరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అల్లుడి అక్క కూతురును తన కుమారుడు వివాహం చేసుకున్నాడన్నారు. కోర్టు తీర్పు ప్రకారం చూడటానికి న్యాయవాదితో కలిసి పోతే కొట్టి ఇంట్లో బంధించారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా బయటకు రాలేదన్నారు. ఎస్పీకి విషయం తెలియజేస్తే మంత్రి వద్దకు వెళ్లి ప్రాపర్టీ విషయాలు షటిల్ చేసుకోవాలని, పెళ్లి చేసుకునేటప్పుడు తమ దగ్గరికి వచ్చి చేసుకున్నారా అని ఎస్పీ ప్రశ్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిని మంత్రి బంధువుల చెర నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేశారు.


