● అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వకాలు ● తమ్ముళ్ల అండతో
అడిగేదెవరు!
ప్యాపిలి: ఎక్కడైనా గ్రావెల్ తవ్వాలంటే అనుమతులు ఉండాలి. అయితే, తనకు ఇవేవి పట్టవని ఓ కాంట్రాక్టర్ తమ్ముళ్ల అండతో ఏకంగా అటవీ ప్రాంతంలో మట్టి తవ్వి తరలిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని మామిల్లపల్లి నుంచి నల్లమేకలపల్లి వరకు కొత్తగా రోడ్డు మంజూరైంది. ఇటీవలే ఆ రోడ్డు పనులను ప్రారంభించిన కాంట్రాక్టర్ పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా గ్రావెల్ వేస్తున్నారు. ఈ గ్రావెల్‌ను మామిల్లపల్లి గ్రామ శివారు ప్రాంతమైన అటవీప్రాంతం నుంచి గత రెండు రోజులుగా యథేచ్ఛగా టిప్పర్ల ద్వారా రోడ్డు వద్దకు తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో గ్రావెల్ తీయాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, స్థానిక టీడీపీ నాయకులు అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వమే కదా అని కాంట్రాక్టర్‌కు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అతను ఎలాంటి అనుమతులు లేకుండానే అటవీ ప్రాంతం నుంచి జేసీబీ ద్వారా గ్రావెల్ తవ్వి తరలిస్తున్నారు. దీని వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.


