కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రధాని ఫొటో ఏదీ?
● అధికారుల తీరుపై బీజేపీ నేతల ఫైర్
వెలుగోడు: కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన భారతీయ జనతా పార్టీకి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆ పార్టీ మండల నాయకులు మరోసారి మండిపడ్డారు. ఇటీవల వెలుగోడులో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పలు అభివద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, భూమి పూజకు బీజేపీ నాయకులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పోతుల రాజశేఖర్ రెడ్డి బహిరంగ ఆరోపణలు చేయగా, తాజాగా మంగళవారం వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో చేప పిల్లల విడుదల కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలో ప్రధాని నరేంద్రమోదీ ఫొటో ముద్రించకపోవడాన్ని బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నూలు నాగేశ్వరరావు తప్పుపట్టారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2020 సెప్టెంబర్ 10న ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) ప్రారంభించారన్నారు. చేపల పెంపకం, ఉత్పత్తిని పెంచడం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, మార్కెటింగ్ వ్యవస్థను ఆధునీకరించడం, మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న గొప్ప పథకాన్ని తీసుకువచ్చిన ప్రధాని నరేంద్రమోదీని జిల్లా, మండల అధికారులు విస్మరించడం సరికాదన్నారు. ప్రధానిని, బీజేపీ పార్టీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై జిల్లా కలెక్టర్‌కు, పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రధాని ఫొటో లేని కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.


