వెల్దుర్తి: పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకుని ప్రయాణిస్తున్న ఆటోలపై ఎంవీఐ రవీంద్రకుమార్ కొరడా ఝళిపించారు. పెద్దల్లారా..పిల్లలు జాగ్రత్త శీర్షికన ఈనెల 16న ‘సాక్షి’లో వెలువడిన కథనానికి రవాణా శాఖ అధికారులు స్పందించారు. మంగళవారం కర్నూలు ఎంవీఐ రవీంద్రకుమార్ 44వ జాతీయ రహదారి చెరుకులపాడు, వెల్దుర్తి క్రాస్‌లు, వెల్దుర్తి ప్రధాన రహదారి తదితర ప్రాంతాల్లో స్థానిక, హైవే పోలీసులతో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. పరిమితికి మించి బడి పిల్లల్ని తీసుకెళ్తూ, ప్రమాదకరంగా టాప్‌పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్తున్న రెండు ఆటోల డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. వాటిని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించి ఓవర్‌లోడ్‌తో పాటు సరైన పత్రాలు లేని కారణంగా రూ.20,220(రూ.14,410, రూ.5,710) జరిమానా విధించారు. ప్రమాదాలు, శిక్షలపై పలువురు ఆటో డైవర్లకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాల సమయాల్లో వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల్లోని గ్రామాలకు బస్సులు నడపాల్సిందిగా డోన్ ఆర్టీసీ డీఎం శశిభూషణ్‌ను కోరామని, వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు.
ఓవర్‌లోడ్ ఆటోలపై ఎంవీఐ కొరడా


