దేశ ఐక్యతను చాటిన ‘వందేమాతరం’
● జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్
నంద్యాల: వందేమాతరం జాతీయ గీతం భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తినిచ్చి దేశ ఐక్యతను చాటిందని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. వందేమాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సునీల్ షెరాన్ ఆధ్వర్యంలో వందేమాతరం గీతాలాపన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. వందేమాతరం గీతాన్ని స్వర్గీయ బంకించంద్ర చటర్జీ 1852లో రచించగా 1875 నవంబర్ 7న జాతీయ గీతంగా గుర్తించబడిందన్నారు. ఈ గీతం భారతదేశంలో కుల,మతాలకతీతంగా ప్రజలలో స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపి ఏకతాటిపై నిలిపిందన్నారు. ఇదే స్ఫూర్తిని ప్రజలకు సేవ చేసే క్రమంలో ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో సబ్ డివిజన్ ఏఎస్పీ ఎం.జావళి, జిల్లా అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, డీఎస్పీ శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్లు మోహన్ రెడ్డి, సూర్యమౌళి, జీవన్ బాబు, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు మంజునాథ్, సురేష్ బాబు, స్పెషల్ పార్టీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


