
ఘాట్ రోడ్డులో ప్రమాదం
● పాత రైల్వే వంతెనను ఢీకొన్న లారీ, డ్రైవర్ దుర్మరణం
మహానంది: నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే నల్లమల ఘాట్‌రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ దుర్మరణం చెందాడు. బొగద వంతెన దాటిన తర్వాత ఉన్న పురాతన రైల్వే వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి విజయవాడ వెళుతున్న లారీ మలుపు వద్ద అదుపు తప్పి పురాతన వంతెనను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వంతెన గోడ, లారీ మధ్య ఇరుక్కు పోయిన లారీ డ్రైవర్ రాజు (42) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదిలా ఉండగా లారీ రోడ్డుకు అడ్డుగా ఉండటంతో సుమారు ఆరు గంటల పాటు నల్లమల ఘాట్‌రోడ్డులో వాహనాల రాకపోకలు స్తంభించాయి. నంద్యాల నుంచి విజయవాడ, విజయవాడ వైపు నుంచి నంద్యాల, కర్నూలు, అనంతపురం మీదుగా ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న గిద్దలూరు, మహానంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. రెండు క్రేన్లను తీసుకెళ్లి వాటి సాయంతో రోడ్డుపై అడ్డుగా ఉన్న లారీని పక్కకు తప్పించడంతో ఆరు గంటల తర్వాత వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. ప్రమాద స్థలం గిద్దలూరు పరిధికి రావడంతో గిద్దలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఘాట్ రోడ్డులో ప్రమాదం