
ఇలా ఉంటే ఎలా చదువుతారు?
● గురుకులం నిర్వహణ లోపాలపై
మంత్రి సవిత ఆగ్రహం
వెల్దుర్తి: వందలాది బాలికలు చదువుకునే గురుకులం నిర్వహణ ఇంత అధ్వానమా.. అంటూ బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర మంత్రి సవిత వెల్దుర్తి మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె కర్నూలులో ప్రధానమంత్రి పర్యటనకు హాజరై తిరిగి అనంతపురం వెళ్తూ మార్గమధ్యలో వెల్దుర్తి బీసీ గురుకులాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా విద్యార్థినుల వద్దకు వెళ్లి ఎలా చదువుతున్నారని, భోజన, సౌకర్యాలు ఎలా ఉన్నాయని తెలుసుకున్నారు. అనంతరం స్టాఫ్ రిజిస్టర్, భోజన సరుకుల స్టాక్ రిజిస్టర్‌లు అందుబాటులో లేకపోవడం, భోజన సరుకులు నాణ్యత లేకపోవడం, వాసన వచ్చేంత వరకు వాడకుండా ఉంచడం, ఆ సమయంలో గురుకులంలో ప్రిన్స్‌పాల్, వార్డెన్ తదితరులు లేకపోవడంతో.. ఇదేనా నిర్వహణ అంటూ వైస్ ప్రిన్స్‌పాల్ రాధపై అగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమ శాఖ సెక్రటరీకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. బాలికల గురుకులంలో ముగ్గురు యువకు లు పనిచేస్తుండడంపై ఇదేమిటంటూ ప్రశ్నించారు. పాఠశాలకు సొంత భవనం, గ్రౌండ్ లేదని విద్యార్థినులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే ద్వారా వెల్దుర్తి బీసీ గురుకల పాఠశాలకు సొంత భవన ఏర్పాటు కోరుతూ వినతి వచ్చిందని, త్వరలో తగు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.