
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత
● నూతన జాయింట్ కలెక్టర్
కొల్ల బత్తుల కార్తీక్
నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని నూతన జాయింట్ కలెక్టర్ కొల్లబత్తుల కార్తీక్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్‌లో అధికారుల సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరిపాలనలో సమర్థత, పారదర్శకతను బలోపేతం చేసే దిశగా కృషి చేస్తానన్నారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే దిశగా అధికారులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు.
బాణసంచా విక్రయాల్లో నిబంధనలు పాటించాలి
నంద్యాల: దీపావళి సందర్భ ంగా బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాలు, దుకాణాలలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ ఎం.జావళి హెచ్చరించారు. శనివారం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించిన వారిపై పేలుడు పదార్థాల చట్టం ప్రకారం చర్యలు తప్పవన్నారు. ప్రమాదాలకు తావులేకుండా, సరైన భద్రతా ప్రమాణాలు, సూచనలు పాటిస్తూ షాప్‌లు ఏర్పాటు చేసుకుని టపాసులను విక్రయించాలన్నారు. జనసంచారం, ప్రజల నివాస ప్రాంతాలలో టపాసులు విక్రయించరాదని, ప్రభుత్వ అధికారులు నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే నిబంధనల ప్రకారం దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నీరు, ఇసుక, తదితర అగ్నిమాపక సామగ్రిని తప్పనిసరిగా టపాసుల విక్రయ దుకాణాల్లో సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎవరైనా అక్రమంగా టపాసులు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 112 లేదా సంబంధిత పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు.
బిట్‌కాయిన్ పెట్టుబడుల పేరుతో మోసాలు
కర్నూలు: బిట్‌కాయిన్ పెట్టుబడుల విషయంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా ప్రజలకు సూచించారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పెట్టుబడులు పెడితే లాభాలు వస్తున్నాయంటూ ఫాలోయర్లకు నకిలీ లింకులు పంపుతున్నారని, బిట్‌కాయిన్‌ను క్రిప్టో కరెన్సీలలో మదుపు చేస్తే లాభాలంటూ స్నేహితులకు సందేశాలు పంపుతున్నట్లు పేర్కొన్నారు. లాభాలు వచ్చినట్లు కొన్ని ఫొటోలు చూపించి ఆశ కల్పిస్తారని, ఆ సందేశాలు చూసి కొందరు లింకు ద్వారా రూ.లక్షల్లో నగదు పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారని తెలిపారు. ముఖ్యంగా టెలిగ్రామ్, ఫేస్ బుక్‌లలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి లింకులు వస్తే అసలు క్లిక్ చేయవద్దని సూచించారు. సైబర్ మోసానికి ఎవరైనా గురైతే వెంటనే సైబర్ క్రైం 1930 హెల్ప్‌లైన్ నెంబర్‌కు, అలాగే www.cyber crime.gov.inలో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత