
శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి బారులుదీరారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. పలువురు భక్తులు ఆన్‌లైన్ ద్వారా టికెట్లు పొంది స్వామివారి స్పర్శదర్శనం నిర్వహించుకున్నారు.
గాలేరు నగరి గేట్లు మూసివేత
అవుకు(కొలిమిగుండ్ల): అవుకు రిజర్వాయర్‌కు సంబంధించి చెర్లోపల్లె సమీపంలో ఉన్న గాలేరు నగరి వరద కాల్వకు చెందిన గేట్లను శనివారం ఎస్సార్బీసీ అధికారులు మూసివేశారు. ఇటీవల రిజర్వాయర్ రివిట్‌మెంట్ కుంగిపోవడంతో నీళ్లను గాలేరు నగరి వరద కాల్వ ద్వారా వైఎస్సార్ కడప జిల్లాకు విడుదల చేశారు. ఎస్సార్బీసీ కాల్వ ద్వారా రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో తగ్గడంతో గేట్లు బంద్ చేశారు. రిజర్వాయర్‌లో రివిట్‌మెంట్ కుంగక ముందు నాలుగు టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 2.40 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
కమనీయం.. ప్రహ్లాదవరదుడి పవిత్రోత్సవం
ఆళ్లగడ్డ: అహోబిలంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం తెల్లవారు జామున మూలవిరాట్ శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవార్లకు నిత్య పూజల అనంతరం పవిత్ర యాగశాలలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరద స్వామి ఉత్సవమూర్తుల ను కొలువుంచి నవకలశ స్నపనం, ద్వారతోరణ పూజ, మండల ప్రతిష్ట, కుంభ ప్రతిష్ట నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పవిత్ర హోమం చేపట్టారు. రాత్రి ఉత్సవ మూర్తులను పల్లకీలో వుంచి గ్రామోత్సవం నిర్వహించారు.
నూతన టీచర్లకు నేడు ఆర్డర్లు
కర్నూలు సిటీ: ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ ప్రక్రి యలో భాగంగా ఇండక్షన్ ట్రైనింగ్ పూర్తయ్యింది. నూ తన ఉపాధ్యాయులను స్కూళ్లకు కేటాయించేందుకు నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ శనివారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలో విద్యార్థుల సంఖ్య కు తగ్గట్టు 4,168 టీచర్ల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఏప్రిల్‌లో 2,678 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. రాత పరీక్షలో ఎంపికైన 2,590 మందికి ఈ నెల 3 నుంచి నిర్వహించిన ఇండక్షన్ ట్రైనింగ్ ఈ నెల 10న ముగిసింది. ఇద్దరు మినహా మిగిలిన వారందరూ శిక్ష ణ పూర్తి చేసుకున్నారు. వీరిలో 1,765 ఎస్‌జీటీల కు మాన్యువల్‌గా, మిగిలిన స్కూల్ అసిస్టెంట్స్ కు వెబ్ ఆప్షన్స్ ఇచ్చి కౌన్సెలింగ్ పూర్తి చేశారు. కౌన్సెలింగ్‌కు హాజరైన వారందరికీ ఆదివారం ఆర్డర్లు జారీ చేయనున్నారు. వీరందరూ కేటాయించిన స్కూళ్లలో సోమవారం చేరనున్నారు.

శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు