
అంతర పంటల సాగుపై దృష్టి సారించాలి
బనగానపల్లె రూరల్: అంతర పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి మద్దిలేటి అన్నారు. శనివారం యాగంటిపల్లె గ్రామ సమీపంలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో ధన ధాన్య కృషి యోజనపై రైతులకు కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన అధికారి ధనలక్ష్మీ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి మద్దిలేటి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ధన ధాన్య కృషి యోజన ద్వారా పుప్పుధాన్యాలు, పశుపోషణ, ఫుడ్ ప్రాసెసింగ్‌కు సంబంధించి కార్యక్రమాలను ప్రారంభించిందన్నారు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహాయ సంచాలకులు డాక్టర్ జాన్సన్ మాట్లాడుతూ.. పూర్వం దేశం పంటల ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో ఉండేదని, కాలక్ర మేణా వాతావరణ ప్రభావం వల్ల 24 రకాల పంటల ఉత్పాదకత తగ్గిందన్నారు. పంటల సరళిలో మార్పులు చేపట్టి దిగబడులు పొందాలని కేవీకే శాస్త్రవేత్తలు సుధాకర్, బనగానపల్లె మార్కెట్‌యార్డు చైర్మన్ కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి సూచించారు. ఈ సందర్భంగా రైతులకు సబ్సిడీ శనగ విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు వైస్ చైర్మన్ భూషన్న, మండల వ్యవసాయాధికారి సుబ్బారెడ్డి, కేవీకే ఏఈ సురేష్, బనగానపల్లె గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ బురానుద్దిన్ ప్రకృతి వ్యవసాయం సిబ్బంది రైతులు పాల్గొన్నారు.