
ఆర్టీసీ డ్రైవర్ల మెరుపు సమ్మె
● బస్టాండ్లలో ధర్నా
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని అన్ని బస్‌స్టేషన్‌లలో బుధవారం అద్దె బస్సులను నిలిపి వందలాదిమంది డ్రైవర్లు మెరుపు సమ్మె చేశారు. ఆర్టీసీ ఉద్యోగులందరికీ రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ బస్టాండ్లలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి డ్రైవర్లకు, కండక్టర్లకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట దాడులు జరుగుతున్నాయన్నారు. దువ్వూరులో ఆళ్లగడ్డ డిపోకు చెందిన హెయిర్ బస్ డ్రైవర్ మహమ్మద్‌పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. అంత వరకు సమ్మెను విరమించేది లేదన్నారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్‌లో ధర్నా చేస్తున్న డ్రైవర్లతో ఏపీఎస్‌ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రజియా సుల్తానా మాట్లాడారు. ప్రజలకు అవగాహన కల్పించేలా బస్టాండ్‌లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు అద్దె బస్సుల డ్రైవర్లు తెలిపారు.