
నాసిరకం పనులు
నత్తనడకన 340సీ జాతీయ రహదారి నిర్మాణం
రాజకీయ జోక్యంతో అలైన్‌మెంట్‌లో మార్పులు
హైకోర్టు తలుపు తడుతున్న బాధితులు
నాసిరకం పనులతో
నిత్యం మరమ్మతులు
ఆత్మకూరురూరల్: జాతీయ రహదారి నిర్మాణం ఏర్పాటయితే ఆ దారి వెంబడి ఉండే గ్రామాల ప్రజలు, వాహనదారులు ఎంతో సంతోష పడతారు. ప్రయాణ కాలం తగ్గడంతో పాటు ప్రమాదాలకు చోటు ఉండకపోవడమే కారణం. అయితే ఇందుకు విరుద్ధంగా ఉమ్మడి కర్నూలు జిల్లా మీదుగా వెళ్తున్న కర్నూలు – గుంటూరు ప్రధాన రహదారి 340సీ జాతీయ రహదారి నిర్మాణం సాగుతోంది. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ఓ వైపు నాసిరకం పనులు.. మరో వైపు రాజకీయ మలుపులతో రోడ్డు మన్నికపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2014 లో మంజూరైన ఈ రహదారి 2025 నాటికి కూడా పూర్తిగా పనులు జరగలేదు. ఈ రహదారి పూర్తి స్థాయి లో ప్రారంభం కాకముందే రోడ్డు పగుళ్లు బారుతుండడం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో చేసిన పనులనే మళ్లీ చేయాల్సి వస్తోంది. పాములపాడు మండలం సమీపంలో శ్రీశైలం ప్రధాన కుడిగట్టు కాల్వ డీప్ కట్ కోసం జరిపిన తవ్వకాలలో బయట పడిన బిలుకు (వెల్‌స్పాయిల్) గుట్టలుగా పేరుకుని ఉంది. ఈ బిలుకును అక్కడే ఒక క్రషర్ నెల కొల్పి సన్నని ముక్కలుగా చేసి అలా తయారైన కంకరను 340సీ జాతీయ రహదారి అడుగు పాటుకు వినియోగించారు. ఈ బిలుకు లేయర్‌ను తగిన విధంగా తొక్కించక (రోలర్ తిప్పి) పోవడం వల్ల నాసిరకం రాతి పలకులు పిండిగా మారడంతో ఈ రహదారి తొలిదశలోనే నాణ్యతకు తిలోదకాలిచ్చింది.
నిబంధనలు ‘బైపాస్’చేస్తూ..
జాతీయ రహదారి 340సీ కోసం మొదట ఇచ్చిన ప్లాన్ అప్రూవల్‌కు భిన్నంగా అక్కడక్కడా అలైన్‌మెంట్‌లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తొలి ప్లాన్‌లో లేకున్నా పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామంలో ఎంపీ శబరి ఒత్తిడి మేరకు అండర్ పాస్‌తో ఓవర్ బ్రిడ్జి నిర్మాణం అవుతోంది. ఇందుకోసం అవసరమైన భూసేకరణ జరపకుండా ముందు సేకరించిన భూమిలోనే నిర్మాణం చేపట్టడంతో సర్వీస్ రోడ్లు స్థలం చాలక ఇరుగ్గా మారుతున్నాయి.
● ఇదే మండలంలోని రుద్రవరం గ్రామం వద్ద నిర్మిస్తున్న అండర్ పాస్ కూడా అలైన్‌మెంట్ మార్పునకు గురైంది. అయితే రోడ్డు నిర్మాణం భూసేకరణలో లేని భూమి వైపు జరిగారని బాధితుడు హైకోర్టును ఆశ్రయించడంతో అటు వైపు పనులు జరగలేదు. దీంతో కుడివైపున రావాల్సిన సర్వీస్ రోడ్డు కుచించుకు పోయింది. సంబంధిత నిర్మాణ సంస్థ కుడివైపున ఉన్న ప్రయివేట్ భూముల్లో కొంత మేర తమకు ఇవ్వమని రైతులను నయానా, భయాన ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.
● ఆత్మకూరు పట్టణానికి బైపాస్ చేస్తూ వెళ్లే రహదారి, ప్రధాన రహదారిని కలిసే చోట నిర్మించిన అండర్ పాస్ కూడా అలైన్‌మెంట్ తప్పింది. ఇక్కడ కూడా ఎడమవైపు భూసేకరణ జరిగిన భూమిని పూర్తిగా వినియోగించుకోకుండా కుడి వైపు ఎక్కువ స్థలంలో అండర్ పాస్‌ను నిర్మించారు. దీంతో సర్వీస్ రోడ్డు కోసం ఎడమ వైపు ప్రయివేటు భూమిలోకి జరగాల్సి వచ్చింది. ఇది గమనించిన ఆ భూ యజమాని నేరుగా కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి గడ్కరికి ఫిర్యాదు చేయడంతో గుత్తేదారు తగ్గాల్సి వచ్చింది. దీంతో ఎడమ వైపు సర్వీస్ రోడ్డు కుచించుకు పోతోంది. ఇక్కడ ఉన్న ఒక ప్రముఖ హోటల్ యజమాని కేంద్ర ప్రభుత్వ పెద్దల సహకారంతో విజయవంతంగా ముందుకు జరిపించుకోగలిగారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ కారణంగానే ఈ అండర్ పాస్ అలైన్‌మెంట్ మారి సర్వీస్ రోడ్డు సమస్య తలెత్తి నట్లు తెలుస్తోంది.
● ఆత్మకూరు పట్టణ శివార్లలో 340సీ (కర్నూలు – అమరావతి) జాతీయ రహదారి, 167కే (కల్వకుర్తి – నంద్యాల) జాతీయ రహదారులు రెండు క్రాస్ అవుతాయి. ఈ దారిలో ఆత్మకూరు పట్టణాన్ని కనెక్ట్ చేసే సర్వీస్ రోడ్డుకు బైపాస్ కింద దారి చేసేందుకు ఒక అండర్ పాస్ నిర్మించారు. వాస్తవానికి కల్వకుర్తి – నంద్యాల జాతీయ రహదారికి కూడా దారి ఇవ్వడం కోసం ఇక్కడే అండర్ పాస్ నిర్మించాల్సి ఉంది. ముందు చూపుతో అధికారులు ఆలోచన చేసి ఉంటే రెండింటికి ఉపయోగడే విధంగా ఒకే అండర్ పాస్‌తో పని జరిగేది. దీంతో ముందుగా అండర్ పాస్ కోసం నిర్మించిన ప్లయ్ ఓవర్‌ను తొలగించి మరో అండర్ పాస్ నిర్మించాల్సి వచ్చింది. ఇప్పుడు పక్కపక్కనే రెండు అండర్ పాస్‌లు రావడంతో వాహనదారుల్లో సందిగ్ధం నెలకొనే ప్రమాదం పొంచి ఉంది.
రాజకీయ ‘మలుపులు’..

నాసిరకం పనులు