
రేబిస్ వ్యాధితో వ్యక్తి మృతి
కోవెలకుంట్ల: పట్టణ శివారులోని స్వామినగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి రేబిస్ వ్యాధితో మంగళవారం మృతి చెందాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. కాలనీకి చెందిన మెట్ల నాగరాజు(40)కు రెండు నెలల క్రితం కుక్క కరిచింది. కుక్కకాటుకు సంబంధించి ఇంజెక్షన్లు వేయించుకోకుండా నిర్లక్ష్యం చేశాడు. రేబిస్ వ్యాధి ముదిరి సోమవారం సాయంత్రం అపస్మారక స్థితికి చేరుకోగా బంధువులు చికిత్స నిమిత్తం నంద్యాలకు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించగా కోలుకోలేక మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మిదేవి, కుమారుడు లింగమయ్య, కుమార్తె అక్షర ఉన్నారు.
వీడని వర్షం
నంద్యాల(అర్బన్): నాలుగు రోజులుగా జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కుందూనదితో పాటు మద్దిలేరు, పాలేరు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు బండిఆత్మకూరు మండలంలో 70.2 మి.మీ వర్ష పాతం నమోదైంది. వెలుగోడులో 56.0, మహానందిలో 50.2, పగిడ్యాల 48.6, నంద్యాల అర్బన్ 44.0, నంద్యాల రూరల్ 42.4, గడివేముల 32.8, శిరివెళ్ల 32.6, పాములపాడు 32.2, బనగానపల్లె 30.4, రుద్రవరం 30.2, గోస్పాడు 28 మి.మీ మేర వర్షం కురిసింది. వరి, మొక్కజొన్న, పొగాకు, మినుము, మిరప పంటలు నీట మునగడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
నేటి నుంచి పింఛన్ల పంపిణీ
నంద్యాల(న్యూటౌన్):జిల్లాలో ఎన్‌టీఆర్ భరోసా పింఛన్లు బుధవారం నుంచి పంపిణీ చేస్తున్నట్లు డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 2,15,005 మంది పింఛన్ దారులకు రూ.92.64 కోట్లు మంజూరైనట్లు వివరించారు. కాగా సచివాలయ సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి పింఛన్ల పంపిణీలో పాల్గొంటున్నట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు.

రేబిస్ వ్యాధితో వ్యక్తి మృతి