
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
బొమ్మలసత్రం: ప్రభుత్వ వైద్య కళాశాలలు పేద విద్యార్థులకు దేవాలయాలతో సమానమని, వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తే అడ్డుకుంటామని ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యోబు హెచ్చరించారు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయటాన్ని నిరసిస్తూ మంగళవారం స్థానిక బొమ్మలసత్రం సర్కిల్‌లో ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, కౌన్సిలర్ చంద్ర ఆధ్వర్యంలో నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా యోబు మాట్లాడుతూ.. దళితుల పిల్లలు ఉన్నత చదువులు చదివేలా దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఆయన బాటలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేద పిల్లలు వైద్య విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారన్నారు. మిగతా కళాశాలల నిర్మాణానికి కేవలం రూ. 5వేల కోట్లు మాత్రమే అవసరమవుతాయని, అయినా ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వమే వాటి నిర్మాణానికి ముందుకు రావాలన్నారు.
కూటమి ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు యత్నించడం సరైంది కాదని, ఈ విధానాన్ని రద్దు చేసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరుకు సిద్ధమని జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పంతో నంద్యాల మెడికల కాలేజీ నిర్మాణం పూర్తయి ఇప్పటికే విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారన్నారు. ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు అన్ని ప్రభుత్వ వ్యవస్థలను పేదలకు దూరం చేయాలనుకోవడం దారుణమన్నారు. దళితులకు వైద్యం, విద్యను దూరం చేసే దురుద్దేశంతో చంద్రబాబు ఇలాంటి కుటిల ఆలోచనలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షులు నాగేశ్వరరావు, బనగానపల్లి, డోన్, శ్రీశైలం, ఆళ్లగడ్డ, నందికొట్కూరు నియోజకవర్గాల అధ్యక్షులు సత్యం, వెంకస్వామి, జైపాల్, వెంకటన్న, పుల్లయ్య, నాయకులు తిమ్మరాజు, బాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటీకరణ రద్దు
చేయకపోతే పోరుకు సిద్ధం..

మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం