ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు సత్వరమే పరిష్కరించండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల(న్యూటౌన్): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులును సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బాలనాగన్న, నాగరాజు, కాశన్న, దేవదానం, రవికాంత్ బాబు, రమేష్ నాయక్, వెంకటేష్ నాయక్, మురళీ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల వివరాలను ఎప్పటికపుడు విచారించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కేసు వివరాలతో కూడిన నివేదికలను వారం రోజులకు ముందుగానే డీవీఎంసీ సభ్యులు అందజేయాలన్నారు. ఏప్రిల్ 2022 నుంచి మార్చి 2025 వరకు 287 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా 471 మంది బాధితులకు సంబంధించి రూ.6.27 కోట్ల పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు లేవనెత్తిన అంశాలు, గ్రామాల్లో శ్మశాన వాటికల ఏర్పాటుపై సంబంధిత ఆర్డీఓలు, అధికారులు దృష్టి పెట్టాలన్నారు.
సఫాయి కర్మాచార్యులకు తగిన
సౌకర్యాలు కల్పిస్తాం...
సఫాయి కర్మాచారులు కాలువలు పరిశుభ్రం చేసేటప్పుడు తగిన మాస్కులు, గ్లౌజులు అందజేస్తామన్నారు. అదే విధంగా సఫాయి కర్మాచారులకు సకాలంలో వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో నంద్యాల ఏఎస్పీ మంద జావలి అల్ఫోన్స్, నంద్యాల, డోన్, ఆత్మకూరు ఆర్డీఓలు విశ్వనాథ్, నరసింహులు, అరుణజ్యోతి, ఐటీడీఏ పీఓ వెంకట శివప్రసాద్, అదనపు మున్సిపల్ కమీషనర్ దాస్, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.


