ఈతకు వెళ్లి బాలుడి మృతి
ప్యాపిలి: మండల పరిధిలోని ఎస్ రంగాపురంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామాంజనేయులు, సునీతల కుమారుడు చరణ్ (10) సోమవారం ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదివిన చరణ్.. వేసవి సెలవులు కావడంతో తోటి మిత్రులతో కలసి ప్రతిరోజూ గ్రామ శివారులోని కుంటలో ఈత నేర్చుకునేవాడు. రోజులాగే సోమవారం కూడా ఈతకు వెళ్లాడు. నీటిలో మునిగిపోకుండా వీపునకు ప్లాస్టిక్ డబ్బా కట్టుకుని కాసేపు ఈత కొట్టాడు. తర్వాత ప్లాస్టిక్ డబ్బా తొలగించి కుంటలోకి దూకి బయటకు రాలేకపోయాడు. కొద్ది సేపటి తర్వాత అదే కుంటలో ఈత కొడుతున్న కొందరు అడుగున తమకు ఏదో తగులుతోందని గుర్తించారు. వెంటనే అందరూ కలిసి అడుగున ఉన్న చరణ్‌ను బయటకు తీశారు. అప్పటికే బాలుడు మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న బాలుడి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
బాలికపై లైంగికదాడికి యత్నం
బేతంచెర్ల: మండల పరిధిలోని బుగ్గానిపల్లె తండాలో ఏడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగికదాడికి యత్నించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చిన్నారి ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన హరీష్ నాయక్ మాయమాటలు చెప్పి తన ఇంటిపైకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నంచాడు. చిన్నారి కేకలు వేస్తూ తప్పించుకుని వచ్చి తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించి నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్వరరావు సోమవారం తెలిపారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
దేవనకొండ: అప్పుల బాధతో దేవనకొండకు చెందిన గిడ్డిగారి ప్రకాష్(48) అనే రైతుసోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న మూడు ఎకరాల పొలంలో పంటలు పండిస్తూనే సెంట్రింగ్ పనులు చేస్తూ ప్రకాష్ జీవనం సాగించేవాడు. గత రెండు సంవత్సరాల నుంచి పంటలు సరిగా పండలేదు. ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి దాదాపు రూ.15 లక్షలు దాకా అప్పులపాలయ్యాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక నిత్యం సతమతమవుతూ ఉండేవాడు. భార్య పిల్లలు బంధువుల శుభకార్యానికి వెళ్లగా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా శవమై వేలాడుతున్నాడు. దీన్ని గమనించిన స్థానికులు పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


