
‘మీ కోసం’లో అర్జీల సమాచారం
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల(న్యూటౌన్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన అర్జీల (తాజా పరిస్థితిని) సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. దరఖాస్తుదారులు అర్జీల నమోదు, ప్రస్తుత స్థితికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు 1100 నంబర్‌ను కూడా సంప్రదించవచ్చునన్నారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే మాత్రమే జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమానికి రావాలన్నారు. వినతులలో రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫిర్యాదులు అధిక శాతం వస్తున్నాయన్నారు. వినతులను సక్రమంగా పరిష్కరించని కారణంగా 47 రీఓపెన్ అయ్యాయని, వీఐపీ అర్జీలు 7 పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని త్వరితగతిన పరిష్కరించేలా చూడాలన్నారు. జిల్లాలో బంగారు కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు 975 మార్గదర్శులను గుర్తించామని, ఆళ్లగడ్డ మండలం నుంచి ఇంకా మార్గదర్శుల నివేదిక రావాల్సి ఉందని వెంటనే పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. 203 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్‌కు అర్జీలు అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, డీఆర్‌ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.