
నేరాల నియంత్రణ కోసమే కార్డెన్ సెర్చ్
బొమ్మలసత్రం: జిల్లాలో నేరాల నియంత్రణకు ముఖ్యమైన ప్రాంతాల్లో సోమవారం కార్డెన్ సెర్చ్ జరిపామని ఎస్పీ అదిరాజ్‌సింగ్‌రాణా తెలిపారు. ఆత్మకూరు సబ్‌డివిజన్‌లోని పాములపా డు, ఇస్కాల, మండ్లెం, ఆళ్లగడ్డ పరిధిలోని చింతకుంట గ్రామాల్లో వేకువజామున సిబ్బందితో కార్డెన్ సెర్చ్ నిర్వహించామన్నారు. ధ్రువపత్రాలు లేని 44 వాహనాలు, అక్రమంగా నిల్వ ఉంచిన 30 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రౌడీషీటర్లు, పలు అనుమానితుల ఇళ్లను సోదాలు చేసినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల ప్రజలకు నేరాల పట్ల అవగాహన కల్పించామన్నారు. కార్డెన్ సెర్చ్‌లో సీఐలు సురేష్‌కుమార్‌రెడ్డి, యుగంధర్, మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రశాంతంగా ‘పది’ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
నంద్యాల(న్యూటౌన్): పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలోని 35 సెంటర్లలో ప్రశాంతంగా నిర్వహించినట్లు డీఈఓ జనార్దన్‌రెడ్డి తెలిపారు. సోమవారం జరిగిన తెలుగు పరీక్షకు 1,231 మంది గాను 729 మంది విద్యార్థులు హాజరు కాగా 502 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు, 15 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. అలాగే సార్వత్రిక విద్యాపీఠం పదో తరగతి హిందీ పరీక్ష నాలుగు కేంద్రాల్లో నిర్వహించగా 16 మంది విద్యార్థులకు గాను 12 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఇంటర్ హిందీ పరీక్షకు రెండు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించగా 68 మందికి గాను 56 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసినట్లు డీఈఓ తెలిపారు.
డీసీహెచ్‌ఎస్ బాధ్యతల స్వీకరణ
గోస్పాడు: జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త(డీసీహెచ్‌ఎస్)గా డాక్టర్ ఓ లలిత సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పని చేస్తున్న సివిల్ సర్జన్ ఆర్థోపెడిక్ డాక్టర్ జఫరుల్లాను ఉన్నతాధికారులు ఆళ్లగడ్డకు బదిలీ చేశారు. ఆ స్థానంలో బనగానపల్లె ఆసుపత్రి చిన్న పిల్లల విభాగం సివిల్ సర్జన్ డాక్టర్ ఓ లలితను ఇక్కడికి బదిలీ చేయడంతో ఆమె విధుల్లో చేరారు.
ఐఎఫ్‌ఎస్‌కు డీటీఓ
ఐశ్వర్యారెడ్డి ఎంపిక
సాక్షి, నంద్యాల: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించిన ఐఎఫ్‌ఎస్ 2024 తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. యూపీఎస్సీ గత ఏడాది నవంబర్, డిసెంబర్ మెయిన్ పరీక్షలు నిర్వహించింది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పర్సనాలిటీ టెస్ట్ నిర్వహించి తుది ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా 143 మంది అభ్యర్థులు ఐఎఫ్‌ఎస్ సర్వీసులకు ఎంపికయ్యారు. అందులో డీటీఓ ఐశ్వర్యారెడ్డి 13వ ర్యాంకు సాధించి ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికయ్యారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఐశ్వర్యారెడ్డి ఏడు నెలల క్రితం జిల్లాలో బాధ్యతలు చేపట్టారు. ఐశ్వర్యారెడ్డి ఎంపికపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రేషన్ బియ్యం కోసం ధర్నా
ఎమ్మిగనూరుటౌన్: ఈనెల 19 రోజులు గడిచినప్పటికీ రేషన్ బియ్యం ఇవ్వకపోవడంతో ఎమ్మిగనూరు పట్టణం లక్ష్మీపేట వాసులు సోమవారం ధర్నా చేశారు. ప్రతి నెలా మొదటి వారంలోనే రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఈ నెల ఇప్పటి వరకు పంపిణీ చేయకపోవడంతో తాము పస్తులుండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పని చేసుకొని బతికే తమకు రేషన్ బియ్యం పంపిణీ చేయకుంటే ఎలా అని లక్ష్మి, నర్సమ్మ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలైన తమకు సత్వరం రేషన్ బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

నేరాల నియంత్రణ కోసమే కార్డెన్ సెర్చ్

నేరాల నియంత్రణ కోసమే కార్డెన్ సెర్చ్

నేరాల నియంత్రణ కోసమే కార్డెన్ సెర్చ్