
ముట్టడికి తరలిరండి
నంద్యాల(న్యూటౌన్): ఈనెల 21న ఉమ్మడి జిల్లా విద్యాశాఖ కార్యాలయం, 23న విజయవాడలోని విద్యాభవన్ ముట్టడి కార్యక్రమాలకు ఉపాధ్యాయులు తరలిరావాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు సాంబశివుడు, రామపక్కీర్‌రెడ్డి, మహమ్మద్ కాశీం, రామచంద్రారెడ్డి, అబ్దుల్‌అజీజ్, వెంకటరమణ కోరారు. సోమవారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయ ఆవరణంలో ఏపీటీఎఫ్ 1938 జిల్లా అధ్యక్షుడు మాధవస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. పాఠశాల పునర్వీభజన, క్రమబద్దీకరణకు ప్రభుత్వం జారీ చేసిన 19, 20, 21 ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని, జీఓ నెం.117ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యా, ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న ముట్టిడి కార్యక్రమాలకు ప్రతి ఉపాధ్యాయుడు తరలిరావాలన్నారు. సమావేశలలో ఐక్య ఉపాధ్యాయ సంఘం నాయకులు భాస్కరరెడ్డి, కృష్ణారావు, మౌలాలి, సుబ్బయ్య, కృష్ణార్జునరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.