
టీడీపీ నాయకుడి ఇంటికి ఆలయ నీరు!
ఆలూరు: దేవస్థానంలో భక్తులకు అందాల్సిన నీరు టీడీపీ నాయకుడి ఇంటికి నేరుగా వెళ్తోంది. ఇందుకు అక్రమంగా పైప్‌లైన్ వేసుకున్నారు. అధికారుల అనుమతి కూడా తీసుకోలేదు. ఆలూరు మండలంలోని మొలగవెల్లి గ్రామంలో కాశీవిశ్వేశ్వరస్వామి దేవాలయం ఉంది. ఆలయానికి వచ్చే భక్తులకు తాగునీటి వసతి కల్పించాలని పంచాయతీ అధికారులకు గ్రామపెద్దలు విన్నవించారు. ఇదే అదునుగా భావించిన గ్రామ టీడీపీ నాయకుడు దేవాలయంలో భక్తుల తాగు నీటికోసం ఇచ్చిన మంచినీటి పైపులకు అదనంగా వాల్‌ను బిగించుకున్నారు. ప్లాస్టిక్ పైపులైన్ వేసుకుని తన ఇంటికి దేవాలయ నీటిని తరలించుకుంటున్నారు. ఈ నీటితో తన వాహనాలను శుభ్రం చేస్తున్నారు. టీడీపీ నాయకుడి దౌర్జన్యాన్ని చూసి గ్రామ ప్రజలు ఇదేమి చోద్యం అని చర్చించుకుంటున్నారు. అంతటితో ఆగకుండా పంచాయతీ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పీఎస్ వెంకటనాయుడి దృష్టికి తీసుకెళ్లగా.. అక్రమ మంచినీటి కుళాయి కనెక్షన్‌ను తీసుకున్న విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటానని తెలిపారు.