‘మధ్యాహ్నం’పై ధరల భారం | - | Sakshi
Sakshi News home page

‘మధ్యాహ్నం’పై ధరల భారం

Jul 30 2026 5:12 AM | Updated on Jul 30 2026 5:12 AM

మెనూ చార్జీలు పెంచాలి

మార్కెట్‌లో పెరిగిన ధరల ప్రకారం విద్యార్థులకు మెనూ చార్జీలు పెంచాలి. ప్రభుత్వమే అన్నిరకాల సరుకులు సరఫరా చేస్తే ఏజెన్సీలపై భారం పడకుండా ఉంటుంది. ప్రతి నెలా జీతాలు, బిల్లులు చెల్లించాలి.

– పద్మ, మధ్యాహ్న భోజనం

ఏజెన్సీ నిర్వాహకురాలు

మార్కెట్‌ రేట్లకు అనుగుణంగా

చార్జీలు పెంచని ప్రభుత్వం

అప్పుల పాలవుతున్నామని

ఏజెన్సీ నిర్వాహకుల ఆవేదన

నల్లగొండ టూటౌన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండిపెడుతున్న ఏజెన్సీలపై ఆర్థికభారం పడుతోంది. మార్కెట్‌లో ధరలకు ప్రభుత్వం చెల్లించే మొత్తానికి చాలా వ్యత్యాసం ఉంటోంది. దాంతో తాము అప్పుల పాలవుతున్నామని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగన ధరలతో పాఠశాలల్లో విద్యార్థులకు కోడి గుడ్డు కూడా పెట్టలేకపోతున్నామని చెబుతున్నారు.

77,422 మంది విద్యార్థులు..

జిల్లా వ్యాప్తంగా 1230 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 77,422 మంది విద్యార్థులు ఉన్నారు. ఆయా పాఠ శాలల్లో మొత్తం 1,230 మధ్యాహ్న భోజన ఏజెన్సీలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో ఓ నిర్వాహకురాలితో పాటు హెల్పర్లు ఇద్దరు చొప్పున వంట చేస్తూ మధ్యాహ్న భోజనం అందజేస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థుల ఆకలి తీరుస్తున్నారు. నిర్వాహకులకు ప్రభుత్వం ప్రతి నెల రూ.3 వేల వేతనం ఇస్తోంది. బియ్యం ప్రభుత్వం సరఫరా చేస్తూ.. ఖర్చులకు ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.6.78 లు, 6,7,8వ తరగతి వారికి రూ.10.17, 9, 10వ తరగతి వారికి రూ.13.17 చొప్పున ఇస్తోంది. ప్రస్తుత ధరలు చూస్తే ఈ మొత్తం వారికి మాత్రం పరిపోవడం లేదు.

వారానికి మూడు గుడ్లు..

మెనూ ప్రకారం ప్రతి విద్యార్థికి వారంలో మూడుసార్లు గుడ్డు పెట్టాల్సి ఉంటుంది. ఒక్కో విద్యార్థికి నెలకు 12 గుడ్లు పెట్టాల్సి ఉంది. జిల్లాలోని 77,422 మంది విద్యార్థులకు ఒక్క నెలకు 9 లక్షల 29 వేలు గుడ్లు వడ్డించాలి. ప్రభుత్వం ఇస్తున్న గుడ్డుకు ఇస్తున్న ధర రూ.6 లు, కాగా మార్కెట్‌లో ధర రూ.8లు ఉంది. దాంతో ఏజెన్సీ నిర్వాహకులపై అదనంగా నెలకు రూ.18,58,128 అదనపు భారం పడుతోంది.

పెరుగుతున్న ధరలతో సతమతం..

కొంతకాలంగా మార్కెట్‌లో అన్ని వస్తువుల ధరలు మండిపడుతున్నాయి. వంట గ్యాస్‌, కూరగాయలు, నూనె ధరలు మండిపోతుండటంతో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు సతమతం అవుతున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు కూడా నెలల తరబడి పెండింగ్‌లో ఉండటంతో కార్మికులు, ఏజెన్సీ ప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ధరల ప్రకారం ప్రభుత్వం మెనూ ధరలు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement