ఫ కలెక్టర్ చంద్రశేఖర్
మర్రిగూడ : మండలంలోని శివన్నగూడెం రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న నర్సిరెడ్డిగూడెం నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. బుధవారం ఆయన మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం రిజర్వాయర్ సమీపంలో ముంపు బాధితులు సొంతంగా నిర్మించుకున్న గృహాలను పరిశీలించారు. రిజర్వాయర్ ముంపునకు గురైన మొత్తం 287 కుటుంబాలకు గాను ప్రభుత్వం గతంలో చింతపల్లి వద్ద ఇళ్ల స్థలాలు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే చింతపల్లి వద్ద కేటాయించిన ప్లాట్లకు నంబర్ల కేటాయింపు, స్థలాల అప్పగింతలో ఆలస్యం కావడంతో 54 మంది బాధితులు శివన్నగూడెం వద్ద ఒక ప్రైవేట్ వెంచర్‌లో సొంతంగా ఇళ్లు నిర్మించుకున్నారని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కలెక్టర్‌కు తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ప్రైవేట్ వెంచర్‌లో ఇండ్లు నిర్మించుకున్నందున తమకు ఇందిరమ్మ గృహాల కింద ఇచ్చే రూ.5 లక్షల సాయాన్ని మంజూరు చేయాలని కోరారు. ఆర్‌అండ్‌ఆర్ సమస్యలను తీర్చాలని, కోర్టులో పెండింగ్‌లో ఉన్న స్థల వివాదాన్ని పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల వచ్చిన కోర్టు ఉత్తర్వుల ప్రకారం వివాదస్పద భూమి విషయాన్ని 10 నుంచి 15రోజుల్లో అవార్డు పూర్తి చేసి, మిగిలిన 32 మందికి కూడా ప్లాట్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితుల సమస్యలన్నింటిని దశలవారీగా పరిష్కరిస్తామన్నారు. ఆయన వెంట దేవరకొండ ఆర్డీఓ శ్రీదేవి, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రెయినీ) శ్రీకాంత్‌రెడ్డి, తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు, ఎంపీడీవో జి.చినమునయ్య, సర్పంచ్ రాపోలు యాదగిరి తదితరులు ఉన్నారు.


