కొండమల్లేపల్లి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన మంగళవారం కొండమల్లేపల్లి మండల పరిధిలోని గుమ్మడవెల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండాకు అవమానం జరిగింది. మంగళవారం ఉదయం ఎగరవేసిన జాతీయ జెండాను, బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వరకు తొలగించలేదు. జెండా కర్రకు ఉన్న జాతీయ జెండా నేల మీద పడి అవమానానికి గురైంది. సాయంత్రం పంచాయతీ సిబ్బంది జెండాను తీశారు. జాతీయ జెండాపై బాధ్యతలేని సంబంధిత అ ధికారులు, గ్రామపంచాయతీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఎంజీయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా అరుణప్రియ
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా కె.అరుణప్రియ నియమితులయ్యారు. రిజి స్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి నుంచి బుధవారం ఆమె నియామకపత్రం అందుకున్నారు. గతంలో ప్రిన్సిపాల్‌గా, అడిషనల్ కంట్రోలర్‌గా సేవలందించిన ఆమె తిరిగి ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమెకు కళాశాల అధ్యాపకులు శుభాకాంక్షలు తెలిపారు.
విద్యార్థులకు విమాన ప్రయాణం
రామగిరి(నల్లగొండ) : మండలంలోని కొత్తపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులను ఆ పాఠశాల ఉపాధ్యాయుడు విమానం ఎక్కించాడు. పాఠశాల పదో తరగతి ఫలితాల్లో, ఇంగ్లిష్ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులను విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకెళ్తానని ఆ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు బివి చారి విద్యార్థులకు మాట ఇచ్చారు. అన్నట్లుగానే.. పాఠశాల టాపర్‌గా నిలిచిన ఏడుకొండల వైష్ణవి, ఇంగ్లిష్ సబ్జెక్టు టాపర్ బుట్టి ఇందును తన సొంత ఖర్చులతో శంషాబాద్ నుంచి విమానంలో విజయవాడకు తీసుకువెళ్లారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సాహించడం ద్వారా చదువుపై మరింత ఆసక్తిని పెరుగుతుందని సర్పంచ్ జిల్లేపల్లి రేణుకరాజు కొనియాడారు.
నీటిని సంరక్షించాలి
కేతేపల్లి : నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని, వర్షాకాలంలో పడిన ప్రతి నీటి చుక్క భూమిలో ఇంకే విధంగా చూడాలని డీఆర్‌డీఓ వై.శేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం కేతేపల్లి మండలంలోని తుంగతుర్తి, చెర్కుపల్లి, కొండకిందిగూడెం, బండపాలెం గ్రామాల్లో తెలంగాణ కళాజాత బృందం ఆధ్వర్యంలో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుదలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు తీసుకోవాలన్నారు. మురుగు నీటి కాలువ చివరన ఖాళీగా వదలకుండా కమ్యునిటీ ఇంకుడు గుంతను ఏర్పాటు చేయాలన్నారు. పంట కాల్వల్లో పూడికను తొలగించి చివరి ఆయకట్టు వరకు నీరు వెళ్లేలా చూడాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు పి.శ్రీనివాసరావు, సుదర్శన్‌రెడ్డి, జానయ్య, ఎంపీడీఓ నాగలక్ష్మి, ఏపీఎం మల్లేష్, ఏపీఓ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక టెట్ నిర్ణయంపై హర్షం
నల్లగొండ : ఏటా జరిగే రెండు సాధారణ టెట్‌లతోపాటు, ఇన్ సర్వీస్ టీచర్ల కోసం రెండు ప్రత్యేక టెట్‌లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై సీఎం రేవంత్‌రెడ్డికి టీఆర్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు నిమ్మనగోటి జనార్దన్, ప్రధాన కార్యదర్శి తరాల పరమేష్‌యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఉపాధ్యాయులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.


