ఫ శిథిలావస్థలో చండూరు పీహెచ్‌సీ భవనం
ఫ వైద్యానికి వచ్చేందుకు జంకుతున్న జనం
చండూరు : మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఆసుపత్రికి వెళ్లాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. 15 ఏళ్లుగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆసుపత్రిని అద్దె భవనంలోకి మారుస్తామని చెబుతున్నా.. అది కార్యరూపం దాల్చలేదు. దాతల సహకారంతో సేకరించిన స్థలంలో నిర్మించిన ఈ భవనాన్ని 2001లో ప్రారంభించారు. పట్టణానికి చివరన ఉండటం వల్ల రోగులు అంత దూరం వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. సరైన నిర్వహణ లేకపోవడంతో 15 ఏళ్లుగా భవనం లోపల, బయట శ్లాబ్ పెచ్చులు ఊడిపోయి ఇనుప రాడ్లు బయటపడుతున్నాయి. నేల కూడా కుంగిపోయి, గోడులు బీటలు వారాయి. సమస్య తీవ్రతపై విద్యార్థి, యువజన సంఘాలు, రాజకీయ నాయకులు ఎన్నో ఏళ్లుగా మంత్రులు, కలెక్టర్లకు విన్నవిస్తూనే ఉన్నారు.
100 పడకల ఆసుపత్రిగా
మార్చేందుకు ప్రతిపాదనలు
ఇటీవల స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఈ ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. ప్రస్తుతానికి వైద్య సేవలను ప్రైవేటు భవనంలోకి మార్చి, ఆసుపత్రి వెనుక ఉన్న స్థలంలో 100 పడకల ఆసుపత్రి నిర్మించాలని వైద్యులతో చర్చించి నిర్ణయించారు. మండలంలోని బంగారిగడ్డ గ్రామంలో మిషన్ భగీరథ కంట్రోల్ యూనిట్ స్థలంలో పీహెచ్‌సీ నిర్మాణానికి గత ఏడాది జూన్ 6న ఎమ్మెల్యే స్థల పరిశీలన చేశారు. ఈ ఏడాది ఏప్రిపల్ 20న కూడా రెండో సారి ఆ ప్రదేశాన్ని సందర్శించారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మెయిన్ రోడ్డు పక్కన ఉన్న దేవాదాయ శాఖ స్థలాన్ని కేటాయించాలని ఆ శాఖ కమిషనర్‌ను కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన దేవాదాయ శాఖ కమిషనర్ నివేదిక తెప్పించుకుంటామని స్థలం కేటాయించేలా చూస్తానని హామీ ఇచ్చారు. అయితే, ఏడాది కావస్తున్నా ఈ వ్యవహారం కేవలం స్థల పరిశీలనలకే పరిమితమైందని, కొత్త భవన నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందోనని స్థానిక ప్రజలు ఎదురుచూస్తున్నారు.
శిథిలావస్థలో కనిపిస్తున్న చండూరు పీహెచ్‌సీ భవనం
ఊడుతున్న స్టాబ్‌పెచ్చులు


