నల్లగొండ : వేసవి ఎండలు, వ్యవసాయ అవసరాలు, గృహ, వాణిజ్య రంగాల్లో వినియోగంతో నల్లగొండ జిల్లాలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్) గణాంకాల ప్రకారం బుధవారం జిల్లాలో విద్యుత్ డిమాండ్ 772 మెగావాట్లకు చేరుకుంది. మంగళవారం 709 మెగావాట్లు నమోదుకాగా.. బుధవారం 63 మెగావాట్లు అధికంగా ఉంది. గత ఏడాది ఇదే రోజున 608 మెగావాట్లతో పోలిస్తే 164 మెగావాట్లు ఎక్కువగా నమోదైంది. దీంతో జిల్లాలో విద్యుత్ అవసరాలు ఏటేటా పెరుగుతున్నాయని స్పష్టమవుతోంది.
గతేడాది కంటే 27 శాతం అధికంగా..
ప్రస్తుతం జిల్లాలో కూరగాయలు సాగు, పండ్ల తోటలకు వ్యవసాయ పంపుసెట్ల వినియోగం పెరిగింది. ఉష్ణోగ్రతల కారణంగా కూలర్లు, ఎయిర్ కండీషనర్లు, ఇతర విద్యుత్ ఉపకరణాల వినియోగం అధికమైంది. ఫలితంగా గత ఏడాదికంటే 27 శాతం అధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ శాఖ అధికారులు సరఫరా వ్యవస్థను పటిష్టంగా నిర్వహిస్తూ నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్నారు. జిల్లాలో అభివృద్ధి, పెరుగుతున్న జీవన ప్రమాణాలు, వ్యవసాయ కార్యకలాపాల విస్తరణ విద్యుత్ వినియోగం పెరుగుదలకు ప్రధాన కారణాలుగా అధికారులు పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఫ గతేడాది కంటే 164 మెగావాట్ల పెరుగుదల
ఫ ఎండలతో పెరిగిన విద్యుత్ వినియోగం


