న్యాయవాదుల రక్షణ చట్టంపై హర్షం | - | Sakshi
Sakshi News home page

న్యాయవాదుల రక్షణ చట్టంపై హర్షం

Jun 3 2026 1:21 AM | Updated on Jun 3 2026 1:21 AM

న్యాయవాదులకు ఉక్కు కవచం చరిత్రాత్మక నిర్ణయం సుదీర్ఘ పోరాట ఫలితం..

న్యాయవాదులకు తెలంగాణ న్యాయవాదుల చట్టం–2026 ఉక్కు కవచం లాంటిది. ఇక నుంచి న్యాయవాదులు నిర్భయంగా బాధితుల తరఫున వాదించవచ్చు. లాయర్లకు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది.

– వేముల రంజిత్‌కుమార్‌,

స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, నల్లగొండ

రామగిరి(నల్లగొండ) : న్యాయవాదుల రక్షణ, భద్రత కోసం రూపొందించిన తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం–2026 జూన్‌ 2 నుంచి అధికారికంగా అమల్లోకి వస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్‌ 41 విడుదల చేస్తూ మంగళవారం గెజిట్‌ విడుదల చేసింది. ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం పట్ల న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చట్టంలోని ముఖ్యమైన నిబంధనలు

న్యాయవాదులు లేదా వారి కుటుంబ సభ్యులపై దాడులు, బెదిరింపులు, వేధింపులకు పాల్పడితే జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. పోలీసు యంత్రాంగం న్యాయవాదులను ఇష్టానుసారంగా అరెస్ట్‌ చేయడానికి వీల్లేదు. చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ముందస్తు అనుమతి లేదా కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టం కింద నమోదయ్యే కేసులను డీఎస్పీ లేదా అంతకంటే పైస్థాయి అధికారి మాత్రమే దర్యాప్తు చేయాలి. 60 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి, 6 నెలల్లోగా కోర్టు విచారణ ముగించాల్సి ఉంటుంది.

రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అడ్వకేట్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌–2026 అమల్లోకి తీసుకురావడం చరిత్రాత్మక నిర్ణయం. న్యాయవాదులకు భద్రత కల్పించాలని సుధీర్ఘ కాలంగా చేస్తున్న పోరాట ఫలితమే ఈ చట్టం. న్యాయవాదులపై జరిగే దౌర్జన్యాలను నిరోధించడానికి ఈ చట్టం దోహదపడుతుంది. దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని అమలు చేయాలి.

– పందుల సైదులు, న్యాయవాది

న్యాయవాదుల సుదీర్ఘ పోరాటం ఫలితంగా ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టం–2026 ఏర్పాటు చేయడం శుభ పరిణామం. న్యాయవాది వృత్తి ధర్మం పాటిస్తూ బాధితుల పక్షాన ధైర్యంగా న్యాయ పోరాటం చేయవచ్చు. చట్టాన్ని గౌరవిస్తూ న్యాయవాదులపై దాడులకు పాల్పడకుండా ఉండాలి.

– మందా నగేష్‌, బార్‌ అసోసియేషన్‌ మాజీ జనరల్‌ సెక్రటరీ, నల్లగొండ

Advertisement
 
Advertisement
Advertisement