– శ్రీకాంతాచారి మాతృమూర్తి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ
మోత్కూరు : హైదరాబాద్‌లోని కొత్తపేట ప్రూట్ మార్కెట్ స్థలంలో ప్రభుత్వం నిర్మిస్తున్న వెయ్యి పడకల ఆసుపత్రికి తెలంగాణ మలిదశ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని ఆయన మాతృమూర్తి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు హైదరాబాద్‌లోని ఒకే ప్రాంతంలో అమర వీరుల కుటుంబాల కాలనీ నిర్మించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. సోమవారం ఆమె యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ‘సాక్షి’ తో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం హైదరాబాద్‌లోని ఎల్‌బినగర్ చౌరస్తాలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని తన కొడుకు ఆత్మాహుతి చేసుకున్నాడని, ఆస్పత్రికి శ్రీకాంతాచారి పేరు పెట్టడంతో ఆత్మ శాంతిస్తుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ అమరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం, నెలకు రూ.25 వేల పింఛన్, ఆరోగ్య భద్రత కార్డులు అమలు చేస్తే ఆ కుటుంబాలు ఆత్మ గౌరవంగా బతుకుతాయని అన్నారు. కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి, జయంతిలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలుగా తనను నియామకం చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.


