నల్లగొండ : నల్లగొండ పట్టణంలో గురువారం సాయంత్రం వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో పాటు వడగళ్లతో అరగంట పాటు కురిసిన వానకు జనం అతలాకుతలమయ్యారు. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. చాలా చోట్ల ఇళ్ల పైకప్పు లేయిపోయి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. నల్లగొండలోని బీఆర్‌ఎస్ కార్యాలయం సమీపంలో ఓ ఇంటి పైనున్న హోర్డింగ్ విరిగింది. అయితే సగం విరిగి వేలాడుతున్న ఆ హోర్డింగ్‌ను తొలగించలేదు. మళ్లీ ఈదురుగాలి వస్తే జనాలపై పడే ప్రమాదం ఉంది. గొల్లగూడలోని శాంతి మహిళా మండలి వృద్ధాశ్రమంలో భారీ వృక్షం నేలకూలింది. రహమత్‌నగర్ రోడ్డు వరద నీటితో నిండింది.
కూలిన వ్యాపార సముదాయం..
కలెక్టరేట్ నుంచి ఆర్‌టీఓ కార్యాలయం వెళ్లే దారిలో ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసుకున్న వ్యాపార సముదాయాల పైకప్పు రేకులు లేచిపోయి దూరంగా పడ్డాయి. భారీ ఈదురుగాలులతో విద్యుత్ లైను తెగి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కొన్ని కాలనీలు రాత్రి వేళ అంధకారంలోనే ఉన్నాయి.


