ఆలేరు : బంగారు ఆభరణాలు కొనేందుకు వచ్చి, బంగారం దుకాణం యజమానిని ఏమార్చి చోరీకి యత్నించాడు ఓ దొంగ. అతడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఆలేరు పట్టణంలో సోమవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాప్ సమీపంలో సంపత్‌చౌదరి అనే వ్యక్తి భవానీ జ్యువెల్లరీ షాపు నిర్వహిస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన అబ్బాస్‌అలీ జ్యువెల్లరీ షాపు వద్దకు వచ్చాడు. తనకు బంగారు కావాలని యజమాని సంపత్‌చౌదరికి చెప్పాడు. దీంతో యజమాని వివిధ రకాల ఆభరణాలను టేబుల్ పైన పెట్టాడు. ఇంకా ఏమైనా ఆభరణాలు ఉంటే చూపెట్టమంటూ షాపు యజ మానిని మాటలతో ఏమార్చాడు. ఈ క్రమంలో సుమారు మూడున్నర తులాల బంగారు గొలుసును జేబులో వేసుకొని షాపు నుంచి హడావిడిగా బయటకు వచ్చి పారిపోతుండగా.. యజమాని గమనించి కేకలు వేశాడు. స్థానికులు అప్రమత్తమై పారిపోతున్న అబ్బాస్ అలీని పట్టుకొని దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జ్యువెల్లరీ షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆలేరు ఎస్‌ఐ వినయ్ తెలిపారు.
దొంగను పట్టుకుని
దేహశుద్ధి చేసిన స్థానికులు
పోలీసులకు అప్పగింత
ఆలేరు పట్టణంలో ఘటన


