ఎంజీయూలో జీఎస్టీ అధికారుల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ఎంజీయూలో జీఎస్టీ అధికారుల తనిఖీ

Apr 9 2026 8:17 AM | Updated on Apr 9 2026 8:17 AM

నల్లగొండ టూటౌన్‌ : మహాత్మాగాంధీ యూనివర్సిటీకి సంబంధించిన ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ ప్రభుత్వానికి రూ.99 లక్షల జీఎస్టీ ఎగ్గొట్టిన వ్యవహారంలో బుధవారం స్టేట్‌ జీఎస్టీ అధికారులు యూనివర్సిటీలో తనిఖీలు చేశారు. ఈనెల 7వ తేదీన ‘సాక్షి’లో ‘రూ. 99 లక్షల జీఎస్టీ ఎగనామం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి రాష్ట్ర జీఎస్టీ అధికారులు స్పందించారు. బుధవారం జీఎస్టీ అసిస్టెంట్‌ కమిషనర్‌ వినయ్‌కుమార్‌ బృందం యూనివర్సిటీకి వచ్చి 113 మంది ఉద్యోగులకు సంబంధించిన జీతాలు, 18 జీఎస్టీ చెల్లింపులు, యూనివర్సిటీ చెల్లించిన 2 శాతం జీఎస్టీ చెల్లింపుల పత్రాలను పరిశీలించారు. ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ చెల్లించాల్సిన 16 శాతం జీఎస్టీకి సంబధించిన రూ.99 లక్షల వివరాలను సంబంధిత యూనివర్సిటీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర జీఎస్టీ అధికారులు దీనిని సీరియస్‌గా తీసుకొని నోటీస్‌లు జారీ చేయడంతో సంబంధిత ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలిసింది. దాంతోనే రాష్ట్ర జీఎస్టీ అధికారులు వచ్చి తెలుసుకున్న పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేధించనున్నట్లు తెలిసింది.

వైజాగ్‌కాలనీలో

ఎకో టూరిజం

ఎమ్మెల్యే బాలునాయక్‌

చందంపేట : నేరెడుగొమ్ము మండలంలోని వైజాగ్‌కాలనీ సమీపంలో ఎకో టూరిజం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్‌ బాలునాయక్‌ అన్నారు. బుధవారం సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ అధ్యక్షతన నిర్వహించిన టీఏసీ సమావేశంలో పాల్గొని పలు ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. దేవరకొండ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ప్రస్తావించానని పేర్కొన్నారు.

విద్యార్థుల సంఖ్య పెంచాలి

పెద్దవూర : ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెంచేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి(డీటీడీఓ) శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం పెద్దవూర గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, ఎస్టీ రెగ్యులర్‌ హాస్టల్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు పట్టికలను, పరిసరాలను పరిశీలించి మాట్లాడారు. పదో తరగతి సమ్మెటీవ్‌ అసెస్‌మెంట్‌–2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అనంతరం డీటీడీఓ శ్రీనివాస్‌ను ఉపాధ్యాయులు, హాస్టల్‌ సిబ్బంది శాలువాతో సత్కరించారు. ఆయన వెంట ఏసీఎంఓ డివి.నాయక్‌, ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం డి.బాలోజీ, హెచ్‌డబ్ల్యూఓ కొల్లు బాలకృష్ణ, ఉపాధ్యాయులు కూన్‌రెడ్డి రాంరెడ్డి, బి.కృష్ణ, ఎండీ.షబ్బీర్‌, శ్రీనునాయక్‌, సురేందర్‌, షాహీన్‌బేగం, జహేదాబేగం, సైదులు, శాంతి, రామయ్య, ఏఎన్‌ఎం జ్యోతి, సిబ్బంది కమలమ్మ, నాగేందర్‌, సాంభయ్య, రాములమ్మ తదితరులు ఉన్నారు.

ఏఎమ్మార్పీ డి–8, 9 కాలువకు నీటి విడుదల

పెద్దవూర: రైతుల అభ్యర్థన మేరకు ఏఎమ్మార్పీ డి–8, 9 కాలువకు బుధవారం నీటిని విడుదల చేశారు. ఏఎమ్మార్పీ పరిధిలోని డి–8, 9 కాలువకు యాసంగి సీజన్‌లో వారబంధీ గడువు ఈ నెల 2వ తేదీతో ముగిసింది. ఈ కాల్వ పరిధిలో పంటలు చేతికిరాకపోవడంతో రైతులంతా కాలువకు నీటిని విడుదల చేసి తమ పంటలను కాపాడాలని ఏఎమ్మార్పీ ఉన్నతాధికారులకు విన్నవించారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఏఎమ్మార్పీ ఏఈ జీవేష్‌ బుధవారం వరి చేలను ఏఈఓలతో కలిసి పరిశీలించి నీటి అవసరం ఉన్నదని నివేదించారు. దీంతో సాయంత్రం నుంచి ఏఎమ్మార్పీ డి–8, 9 కాలువకు నీటిని విడుదల చేశారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు విన్నవించిన వారిలో రైతులు దాసరి శ్రీను, కొండల్‌, లక్ష్మారెడ్డి, అంజి, అంజిరెడ్డి, సూర్య తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement