మళ్లీ తెరపైకి పోలీస్‌ బెటాలియన్‌! | - | Sakshi
Sakshi News home page

మళ్లీ తెరపైకి పోలీస్‌ బెటాలియన్‌!

Apr 2 2026 8:52 AM | Updated on Apr 2 2026 8:52 AM

సంస్థాన్‌ నారాయణపురం: రాష్ట్ర ప్రభుత్వం రెండు నూతన పోలీస్‌ బెటాలియన్లు ఏర్పాటు చేయనుంది. ఈమేరకు సంస్థాన్‌ నారాయణపురం మండల కేంద్రంతో పాటు రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే గతంలో కూడా సంస్థాన్‌ నారాయణపురంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదన వచ్చినప్పటికీ స్థానికంగా కొంతమంది రైతులు ఆందోళన చేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇటీవల ప్రభుత్వం నూతన బెటాలియన్‌ ఏర్పాటు చేస్తున్న క్రమంలో సంస్థాన్‌ నారాయణపురంలో బెటాలియన్‌ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

గతంలో బెటాలియన్‌కు ప్రతిపాదనలు

హైదారాబాద్‌కు 100 కిలోమీటర్ల పరిధిలో పోలీసు బెటాలియన్‌ ఏర్పాటు చేయాలని రెండు సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆధికారులు సంస్థాన్‌ నారాయణపురం సమీపంలోని సర్వే నంబర్‌ 255లోని భూములను పరిశీలించి 84.24ఎకరాల్లో పోలీస్‌ బెటాలియన్‌ ఏర్పాటుకుగాను ప్రతిపాదనలు పంపించారు. అయితే సర్వే నంబర్‌ 255లో 144 ఎకరాల 15 గుంటల ప్రభుత్వ భూమి ఉండగా.. 11 ఎకరాలు పీఏసీఎస్‌(ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) ఆధీనంలో ఉంది. అదేవిధంగా 2 ఎకరాల 15 గుంటల్లో గాంధీనగర్‌ తండా ఉంది. మిగతా భూమిలో దాదాపు 80 సంవత్సరాలుగా తాతల తరాల నుంచి 180 కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటున్నాయి. పత్తితో పాటు ఇతర ఆరుతడి పంటలను పండిస్తున్నారు. వీటిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ భూములకు గతంలో పాత పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు కూడా అందజేశారు. కొంత మంది రైతులుకు డిజిటల్‌ పాస్‌ పుస్తకాలు తీసుకున్నారు. ఈ పాస్‌ పుస్తకాలపై రైతులు బ్యాంకు రుణాలు, ఇతర ప్రభుత్వ పథకాలు కూడా అందుకున్నారు. ఈ భూముల్లో పోలీసు బెటాలియన్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపించడంతో గతంలో రైతులు ఆందోళనలు కూడా చేశారు. తిరిగి బెటాలియన్‌ ఏర్పాటు అంశం తెరమీదుగా రావడంతో తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి వివరణ కోరాగా.. పోలీస్‌ బెటాలియన్‌కు స్థలం కేటాయింపు జరగలేదని తెలిపారు. కేవలం స్థలం ఉందని ప్రతిపాదనలు పంపించినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement