యూనిట్ ఆధారంగా సబ్సిడీ
నల్లగొండ : షెడ్యూల్డ్ కులాల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ఎస్సీ సహకార అభివృద్ధి కార్పొరేషన్ (టీజీఎస్సీసీడీసీ) 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేసింది. ఈ మేరకు జిల్లాలోని ఎస్సీ జనాభా ప్రాతిపదికన మొత్తం 1,368 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఈ పథకంలో లబ్ధి పొందేందుకు గాను అర్హులైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు మంగళవారమే చివరి తేదీగా యంత్రాంగం ప్రకటించింది.
వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం..
జిల్లాకు కేటాయించిన యూనిట్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చింది. 654 ఎలక్ట్రిక్ టూ వీలర్లు, 676 త్రీ వీలర్లను నిరుద్యోగ యువతకు అందించనున్నారు. అలాగే వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు 38 మంది ఎస్సీ రైతులకు సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ యూనిట్లను మంజూరు చేయనున్నారు. వీటితో పాటు యువతకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించి, వారిని వేతన, స్వయం ఉపాధి వైపు మళ్లించనున్నారు.
నేటివరకే దరఖాస్తు గడువు..
అర్హులైన అభ్యర్థులు ఆధార్, రేషన్‌కార్డు, తెలంగాణ ఆవిర్భావం తర్వాత తీసుకున్న కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్ ద్వారా ఓబీఎంఎంఎస్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రవాణా వాహనాలకు పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్, సోలార్ పంప్ సెట్ల కోసం కనీసం రెండెకరాల భూమి, పట్టాదార్ పాస్‌బుక్ కలిగి ఉండటం తప్పనిసరి. ఈనెల 24వ తేదీ వరకు దరఖాస్తు చేయడంతో పాటు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కలెక్టర్ అధ్యక్షతన ఉండే కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. ఎంపికై న వారికి శిక్షణ పూర్తి చేసిన అనంతరం ఏప్రిల్ 16 లోపు యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేసి యూసీలను అందజేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
అర్హతలు, నిబంధనలు ఇలా..
ఈ పథకాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు ఉండాలి. వ్యవసాయేతర పథకాలకు 21 నుంచి 50 ఏళ్లు, వ్యవసాయ పథకాలకు 21 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గలవారు అర్హులు. ఐదేళ్లలో ఏదైనా ప్రభుత్వ ఉపాధి పథకం పొందిన వారు, దళితబంధు లబ్ధిదారులు ఈ పథకానికి అనర్హులని అధికారులు స్పష్టం చేశారు. మహిళలకు 33 శాతం, దివ్యాంగులకు 5 శాతం కోటా కేటాయించారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ టూ వీలర్ల కేటాయింపులో జొమాటో, స్విగ్గీ వంటిలో పనిచేసే గిగ్ వర్కర్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ఫ 2025–26 ఎస్సీ కార్పొరేషన్ ప్రణాళిక ఖరారు
ఫ జిల్లాకు 1,368 యూనిట్లు మంజూరు
ఫ వ్యవసాయ, రవాణా రంగాలకు ప్రాధాన్యం
ఫ ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు నేడు చివరి తేదీ
జిల్లాకు కేటాయింపులు ఇలా..
యూనిట్ లక్ష్యం
ఈవీ టూ వీలర్స్ 654
ఈవీ త్రీ వీలర్స్ 676
సోలార్ పంప్ సెట్లు 38
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు అందించే స్వయం ఉపాధి, ఉపాధి యూనిట్లకు ప్రభుత్వం సబ్సిడీని ప్రకటించింది. యూనిట్ ధర ప్రకారం సబ్సిడీ ఇవ్వనుంది. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు 90శాతం, రూ.3లక్షల వరకు 80 శాతం సబ్సిడీ, రూ.3లక్షల నుంచి రూ.7లక్షల వరకు 60 శాతం సబ్సిడీ ఇవ్వనుంది. సబ్సిడీ పోను మిగిలిన యూనిట్ విలువను బ్యాంక్ రుణంగా ఇప్పించనుంది. ఉపాధి శిక్షణకు సంబంధించి యూనిట్ విలువకు పూర్తి సబ్సిడీ ఇవ్వనుంది.


