నాగార్జునసాగర్ : తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార్ అతిథి గృహంలో వారంతంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. శనివారం విజయ విహార్‌లో మిర్యాలగూడ కేంద్రియ విద్యాలయానికి చెందిన కీర్తన, వినీత, యస్మిత, హరిణి, పవిత్ర, జాస్మిత.. డాన్స్ మాస్టర్ సతీష్ ఆధ్వర్యంలో చేసిన నృత్యాలకు సందర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. నృత్యాలు చేసిన విద్యార్థులకు మహారాష్ట్ర ఎన్నికల కమిషనర్ దినేష్ ప్రోత్సాహక బహుమతులు అందించారు. కార్యక్రమంలో విజయ్ విహార్ మేనేజర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
బడ్జెట్‌లో సకల జనులకు మొండిచెయ్యి
దేవరకొండ : రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సకల జనులకు మొండిచెయ్యి చూపించిందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం దేవరకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బడ్జెట్‌లో ఎక్కడా ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయలేదన్నారు. పేదలకు మంచి చేయాలన్న చిత్తశుద్ధి లేదని రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఎన్నికలకు ముందు అభయహస్తం మేనిఫెస్టోతో ప్రజలను నమ్మబలికి ఓట్లు దండుకుందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 840రోజులు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. సమావేశంలో నాయకులు కేతావత్ బీల్యానాయక్, కిషన్‌నాయక్, టీవీఎన్ రెడ్డి, ఆంజనేయులు, నీల రవి, వేముల రాజు, రూప్లానాయక్, పొట్ట మురళి, మధు, అంజి గౌడ్, బొడ్డుపల్లి కృష్ణ తదితరులున్నారు.


