పంటల సర్వేకు వలంటీర్లు
20 వరకు వలంటీర్ల
నియామక ప్రక్రియ పూర్తిచేస్తాం
నల్లగొండ అగ్రికల్చర్ : పంటల డిజిటల్ సర్వే కోసం వలంటీర్లను నియమించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారి.. జిల్లా వ్యవసాయ శాఖకు ఉత్తర్వులను జారీ చేశారు. వ్యవసాయ డిగ్రీ, డిప్లొమో, సైన్స్ గ్రాడ్యుయేట్ ఇతర డిగ్రీలు ఉత్తీర్ణులైన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని వారు లేకుంటే ఇంటర్, పదో తరగతి ఉత్తీర్ణులైన వారిని నియమించాలని వ్యవసాయ విస్తరణ అధికారు(ఏఈఓ)లకు ఆదేశాలు ఇచ్చింది. వలంటీర్లు ఆయా గ్రామాలకు చెందిన స్థానికులై ఉండాలని అందులో పేర్కొంది. 45 రోజుల్లో సర్వే ప్రక్రియను పూర్తిచేయాలని నిర్దేశించింది. అయితే రెండేళ్ల క్రితమే ఏఈఓలకు డిజిటల్ సర్వే చేయాలని బాధ్యతలు అప్పగించినప్పటికీ వారు ఇతర బాధ్యతలు నిర్వహిస్తున్నందున సక్రమంగా సర్వే నిర్వహించలేదు. దాన్ని దృష్టిలో ఉంచుకుని పంటల నమోదును ప్రైవేట్ వలంటీర్ల ద్వారా చేయించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది.
శిక్షణ అనంతరం సర్వే..
జిల్లా వ్యాప్తంగా 140 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో 564 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అయితే కెడస్ట్రల్ మ్యాప్ (భూభారతి మ్యాప్) కలిగి ఉన్న 495 గ్రామాల్లో పంటల సర్వేకు వలంటీర్లను నియమించనున్నారు. మిగతా గ్రామాల్లో ఏఈఓలే పోర్టల్ ద్వారా సర్వే చేయనున్నారు. ఇప్పటికే ఆయా క్లస్టర్ల పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారులు వలంటీర్ల నియామక ప్రక్రియ ప్రారంభించారు. స్మార్ట్‌ఫోన్ల వినియోగంతోపాటు డిజిటల్ సర్వేపై అవగాహన కలిగి ఉన్న వారిని ఈ నెల 20వ తేదీ వరకు వలంటీర్లుగా నియమించి అనంతరం వారికి ఒకటి రెండు రోజులపాటు శిక్షణ ఇచ్చి నెలాఖరు వరకు సర్వే ప్రారంభించాలని జిల్లా వ్యవసాయ శాఖ యోచిస్తోంది.
5.66 లక్షల ఎకరాల్లో సాగు..
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత యాసంగిలో 5.66 లక్షల ఎకరాల్లో వరి, వేరుశనగ ఇతర పంటలను రైతులు సాగు చేశారు. అందులో వరి 5.44 లక్షల ఎకరాలు, వేరుశనగ ఇతర పంటల సాగు మరో 22 వేల ఎకరాల్లో సాగు చేశారు. పంటలను పూర్తి స్థాయిలో వలంటీర్ల డిజిటల్ సర్వే చేయించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు.
ఈ నెల 20 వరకు వలంటీర్ల నియామక ప్రక్రియ పూర్తికా గానే వారికి శిక్షణ ఇస్తాం. అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోనే యాసంగి పంటల సాగుపై డిజిటల్ సర్వేను ప్రారంభించనున్నాం. ఇప్పటికే కొందరు వ్యవసాయ విస్తరణ అధికారులు వలంటీర్ల నియామకంపై ఇప్పటికే దృష్టి సారించారు.
– పాల్వాయి శ్రవణ్‌కుమార్, డీఏఓ
ఫ గ్రామానికి ఒకరి చొప్పున నియామకం
ఫ ఏఈఓలకు ఎంపిక బాధ్యతలు
ఫ ఉత్తర్వులు జారీచేసిన వ్యవసాయ శాఖ
ఫ ఇప్పటికే నియామక ప్రక్రియ షురూ..
ఫ నెలాఖరులో సర్వే ప్రారంభించే అవకాశం
వ్యవసాయ క్లస్టర్లు 140
రెవెన్యూ గ్రామాలు 564
భూభారతి మ్యాప్
కలిగిన గ్రామాలు 495
జిల్లాలో 5.66 లక్షల
పంటల సాగు ఎకరాలు
ఒక్కో నమోదుకు ఏడు రూపాయలు..
ఎంపికై న వలంటీర్లకు మొబైల్ యాప్ ద్వారా వారికి పంటల నమోదుపై జిల్లా వ్యవసాయ శాఖ శిక్షణ ఇవ్వనుంది. పంటల డిజిటల్ సర్వే చేసే వలంటీర్లకు ఒక్కో డిజిటల్ నమోదుకు ప్రభుత్వం ఏడు రూపాయల చొప్పున చెల్లించనుంది. డిజిటల్ సర్వేలో భాగంగా రైతు డిజిటల్ ఫొటో, భూమి విస్తీర్ణం, ఏ విస్తీర్ణంలో ఏయే పంటలు సాగు చేశారు, రైతు ఫోన్ నంబర్‌ను డిజిటల్ సర్వేలో నమోదు చేయనున్నారు.


