పోటీలో ఉండేదెవరో..!
నేడు తేల్సాల్సిందే..
నామినేషన్ల ఉపసంహరణకు నేడు ఆఖరు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల్లో పోటీలో ఉండే వారిపై చివరి వరకు ఉత్కంఠ తప్పడం లేదు. నామినేషన్లు వేసినా, ప్రధాన పార్టీలు పూర్తి స్థాయిలో అభ్యర్థుల పేర్లను ప్రకటించకపోవడం, బి ఫారాలను ఇవ్వకపోవడంతో ఆయా అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నామినేషన్ల ఉపసంహరణకు, పార్టీ తరపున పోటీలో ఉండే అభ్యర్థులుగా గుర్తింపు కల్పించే బి ఫారాలను అందజేసే గడువు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి వరకు అన్ని పార్టీలు అభ్యర్థులను తేల్చకపోవడంతో ఆశావహులంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. బుజ్జగింపుల ద్వారా నామినేషన్ల ఉపసంహరణకు చర్యలు చేపడుతున్నా ఆశించిన స్థాయిలో సఫలం కావడం లేదు. దీంతో నాయకులకు రెబల్స్ గుబులు పట్టుకుంది.
నల్లగొండ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ మాత్రమే మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి పేరు సహా అన్ని డివిజన్లకు 48 మంది అభ్యర్థులను ప్రకటించింది. వారికి బిఫారాలు అందజేస్తోంది. ఇక బీఆర్‌ఎస్ కూడా 42 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే మేయర్ అభ్యర్థి ఎవరన్నది స్పష్టం చేయలేదు. మరోవైపు బీజేపీ 26 మంది అభ్యర్థులనే ప్రకటించింది. అందులో ముగ్గురి పేర్లను మార్పు చేసింది. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో ఎవరికి బీఫారం దక్కుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 35వ డివిజన్‌లో సిట్టింగ్ బీజేపీ కౌన్సిలర్ గుర్రం వెంకన్న భార్య గుర్రం ధనలక్ష్మి బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. తాము టీఆర్‌ఎస్‌కు వెళ్లారన్న ప్రచారంలో వాస్తవం లేదని వెంకన్న పేర్కొన్నారు. అయితే అక్కడ ఇప్పటికే మరొకరి పేరును బీజేపీ ప్రకటించింది. దీంతో ఎవరికి ఆ పార్టీ బిఫారం ఇస్తుందోనన్న గందరగోళం నెలకొంది. మరోవైపు అదే డివిజన్‌లో బీఆర్‌ఎస్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది.
జిల్లాలోని మరో ఆరు మున్సిపాలిటీల్లో ఆయా పార్టీలు అభ్యర్థులను తేల్చకపోవడంతో ఒక్కో వార్డునుంచి ముగ్గురు, నలుగురు చొప్పున నామినేషన్లు వేశారు. అయితే ఎవరకి పార్టీ బిఫారం ఇస్తుందనే విషయంలో స్పష్టత రాలేదు. చండూరు, మిర్యాలగూడ, చిట్యాల, దేవరకొండ, నాగార్జునసాగర్, హాలియా మున్సిపాలిటీలన్నింటిలో ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడక్కడా కొంతమంది పేర్లను ప్రకటించినా, వారిలో బిఫాం ఇచ్చే విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎవరికి వారే తమకు బీఫారం ఇవ్వాలంటూ నేతలపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలకు తలనొప్పి తప్పడం లేదు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం చాలా మంది పని చేశారు. ఆ సమయంలో వారికి కౌన్సిలర్ టికెట్ ఇస్తామన్న ఆశ చూపారు. ఇలా అన్ని పార్టీల్లోనూ ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. దీంతో రెండు మూడు రోజుల నుంచి బుజ్జగింపులు మొదలు పెట్టినా ఆశావహులు లొంగడం లేదు.
బిఫాం వచ్చేదెవరికి..
అది దక్కనివారి దారెటు?
బుజ్జగింపులకు లొంగని ఆశావహులు
బిఫాం ఇవ్వకుంటే స్వతంత్రులుగా పోటీలో ఉంటామని ప్రకటనలు
అన్ని మున్సిపాలిటీల్లో పూర్తిస్థాయిలోఅభ్యర్థులను తేల్చని పార్టీలు
నామినేషన్ల ఉపసంహరణ, ఎన్నికల అధికారులకు బిఫారాల అందజేతకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకే చివరి గడువు. దీంతో అన్ని పార్టీలు తమ పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులను ఖరారు చేయాల్సిందే. బిఫారాలు ఇవ్వాల్సిందే. ఈ నేపథ్యంలో బిఫారం దక్కని వారు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వారంతా స్వతంత్రులుగా పోటీలో ఉంటే పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులకు పలుచోట్ల ఇబ్బందులు తప్పేలా లేవు.


