118 మంది బాల కార్మికులకు విముక్తి
నల్లగొండ: ఆపరేషన్ స్మైల్ ద్వారా జనవరిలో 92 కేసుల్లో 118 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించినట్లు ఎస్పీ శరత్‌చంద్ర పవార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరు నెలలకొసారి ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాల ద్వారా బాలకార్మికులు, వీధిబాలలను, ఇటుకబట్టీలో నిర్బంద కార్మికులుగా ఉన్నవారిని, కంపెనీల్లో పనిచేసే వారిని కాపాడుతున్నామని పేర్కొన్నారు. ఆపరేషన్ స్మైల్ ద్వారా 92 కేసుల్లో 118 మంది పిల్లలను రెస్యూ చేసామని, వీరిలో 105 మంది బాలలు, 13 మంది బాలికలు ఉన్నారని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎస్పీ తెలిపారు. వీరిలో బీహార్, చత్తీస్‌ఘడ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వారు ఉన్నారని వెల్లడించారు. ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా నెలరోజుల పాటు జిల్లా వ్యాప్తంగా బాలకార్మికులను రెస్క్యూ చేసి కాపాడిన ఏహెచ్‌టీయూ సిబ్బంది, అధికారులను ఎస్పీ అభినందించి రివార్డ్ ప్రకటించారు. ఎవరైనా.. వీధి బాలలు, బాల కార్మికులు కనిపిస్తే డయల్100, 1098, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
పాలిసెట్
నోటిఫికేషన్ విడుదల
రామగిరి(నల్లగొండ) : పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్–2026 (పాలిసెట్) నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి చదువుతున్న లేదా పూర్తి చేసిన విద్యార్థులు డిప్లొమా ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు పాలిసెట్ నిర్వహిస్తారు. విద్యార్థులు ఏప్రిల్ 20వ తేదీలోపు polycet.sbtet.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంట్రెన్స్ ఫీజు ఎస్సీ ఎస్టీలు రూ.250, ఇతరులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. రూ.100 అదనపు రుసుంతో ఏప్రిల్ 21వ తేదీ, రూ.300 అదనపు రుసుంతో ఏప్రిల్ 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 13వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు.
అంబేద్కర్ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా
రామగిరి(నల్లగొండ) : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేశారు. ఫిబ్రవరి 11న పోలింగ్ ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు నల్లగొండ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ బొజ్జ అనిల్‌కుమార్ తెలిపారు. వాయిదా పడిన పరీక్షలు తిరిగి ఫిబ్రవరి 17 నుంచి మార్చి 10 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షకు 3 రోజుల ముందు నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ లేదా స్టడీ సెంటర్లను సంప్రదించాలని సూచించారు.
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
మిర్యాలగూడ : వైద్యులు, సిబ్బంది నిత్యం రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్ అన్నారు. సోమవారం మిర్యాలగూడ బస్తీ దవాఖానాను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి మాట్లాడారు. ఆసుపత్రిలో అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో డీటీసీఓ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ దీప, సిబ్బంది విష్ణు, మోతిలాల్, వాసుదేవరెడ్డి, ప్రభాకర్, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండమేయర్ పీఠం బీజేపీదే
● మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
నల్లగొండ టూటౌన్ : కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలకు మేలు జరిగిందని, తొలిసారి కార్పొరేషన్‌గా ఏర్పడిన నల్లగొండ మేయర్ పీఠం బీజేపీదేనని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. సోమవారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లగొండ కార్పొరేషన్‌లో పోటీ చేసేందుకు బీజేపీలో పోటీ తీవ్రంగా ఉందని, ప్రస్తుతం పోటీ చేస్తున్న అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నూకల నరసింహారెడ్డి, పోతెపాక లింగస్వామి, పాలకూరి రవిగౌడ్, బొజ్జ శేఖర్, బీపంగి జగ్జీవన్, వంగూరి రాఖీ పాల్గొన్నారు.


