మార్చి 1న బుద్ధవనానికి దమ్మ పాదయాత్ర
నాగార్జునసాగర్ : ప్రపంచశాంతిని కాంక్షిస్తూ నిర్వహిస్తున్న 3వ దమ్మ పాదయాత్ర మార్చి 1న నాగార్జునసాగర్‌లోని బుద్ధవనానికి చేరుకోనుందని బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. థాయిలాండ్, భారతదేశాలకు చెందిన సుమారు వందమంది బౌద్ధ భిక్షవులు పాల్గొంటున్న ఈ యాత్ర కర్నాటకలోని కలబురిగి సిద్ధార్థ బుద్ధవిహార్ వద్ద సోమవారం ప్రారంభమైనట్లు తెలిపారు. కర్నాటకలోని ఉప్లాన్, కురికోట, మారగుట్టి, లాల్‌దారి, కప్పార్గం, మన్నెకెల్లి మీదుగా 9వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని మడిగికి చేరుకోనుందని పేర్కొన్నారు. తెలంగాణలోని పలుప్రాంతాల మీదుగా సాగనున్న ఈ యాత్ర ఫిబ్రవరి 18న సికింద్రాబాద్ మహాబోధి బుద్ధవిహారానికి చేరుకుంటుందన్నారు. అక్కడి నుంచి 20న బయల్దేరి ఉప్పల్ తర్కయంజాల్, ఇబ్రహీంపట్నం, యాచారం, మాల్, చింతపల్లి, కొండమల్లేపల్లి, అంగడిపేట, పెద్దవూర మీదుగా మార్చి1వ తేదీన నాగార్జునసాగర్ చేరుకుంటుందని తెలిపారు. రెండు రోజులపాటు సాగర్‌లో ఉంటుందన్నారు.
బుద్ధవనాన్ని సందర్శించిన బౌద్ధ భిక్షువులు
హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి ప్రాంతానికి చెందిన బౌద్ధ భిక్షువులు సోమవారం సాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించారు. బుద్ధుడి పాదాలచెంత పుష్పాంజలి ఘటించిన అనంతరం బుద్ధచరిత వనం, ధ్యానవనం, స్థూపవనం తదితర ప్రాంతాలను సందర్శించారు. మహా స్థూపంలో కాసేపు ధ్యానం చేశారు. వారికి ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర బుద్ధవనం బ్రోచర్లను అందజేసి.. బౌద్ధకండువాలతో సత్కరించారు.


