సీఎం సభకు ఏర్పాట్లు ముమ్మరం
మిర్యాలగూడ : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మిర్యాలగూడలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మిర్యాలగూడ మండలంలోని గూడూరు సమీపంలో సభా వేదిక ఖరారు చేశారు. బహిరంగ సభలో సుమారు 40వేల మంది కూర్చొనే విధంగా కుర్చీలను ఏర్పాటు చేస్తున్నారు. తాగునీరు సౌకర్యంతోపాటు బారీకేడింగ్ తదితర పనులు చురుకుగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వెయ్యి మంది పోలీసులతో సభా ప్రాంగణం వద్ద గట్టి నిఘా పెట్టనున్నారు. ముగ్గురు అడిషనల్ ఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు, 40 మంది సీఐలు, వంద మంది ఎస్‌ఐలు, 900 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నారు. బహిరంగ సభ, హెలిప్యాడ్ తదితర ఏర్పాట్లను రెవెన్యూ, పోలీసు, ఆర్‌అండ్‌బీ, డీపీఓ తదితర శాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
వెయ్యిమంది పోలీసులతో బందోబస్తు


