బేరసారాలు!
3న మూడో విడత నోటిఫికేషన్
సర్పంచ్ పదవులకు
జిల్లాలోని మిగితా మండలాల్లోనూ ఏకగ్రీవం కోసం చర్యలు చేపడుతుండగా, కొన్ని చోట్ల వేలం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. పెద్దవూర మండలం జైరాంతండాలో సర్పంచ్ పదవికి వేలం నిర్వహించగా, రూ.15 లక్షలకు అదే తండాకు చెందిన శ్రీనునాయక్ వేలం పాడినట్లుగా తెలిసింది. నకిరేకల్ మండలంలో గొల్లగూడెం గ్రామ పంచాయతీలో ఒకే ఒక్కరు నామినేషన్ వేశారు. మరో 4 వార్డులకు ఒకటి చొప్పునే నామినేషన్‌లు వేశారు. వీటితో పాటు మరో 4 వార్డుల్లో ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ సర్పంచ్ పదవికి ఒకటే నామినేషన్ రావడంతో ఏకగ్రీవం కానుంది. ఏదేమైనా రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు వేలం పాటలు, కూర్చొని మాట్లాడుకోవడం వంటి సంఘటనలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవులకు బేరసారాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొదటి విడత నల్లగొండ, చండూరు రెవెన్యూ డివిజన్లలో నామినేషన్లు, వాటి పరిశీలన పూర్తయింది. ఇక ఉపసంహరణ మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో గ్రామాల్లో ఏకగ్రీవాల కోసం ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నారు. మరోవైపు వేలం పాటలు కొనసాగుతున్నాయి. అందులో ఎవరు ఎక్కువ వెచ్చించేందుకు ముందుకు వస్తారో వారే సర్పంచ్‌లుగా ఏకగ్రీవం అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. కాగా రెండో విడత నామినేషన్లు మంగళవారంతో ముగియనుండగా, మూడో విడత ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 3వ తేదీన నుంచి ప్రారంభం కానుంది.
గ్రామాల్లో కొనసాగుతున్న సందడి
పంచాయతీ ఎన్నిలక నేపథ్యంలో గ్రామాల్లో సందడి నెలకొంది. సర్పంచ్ పదవులకు మూడు నాలుగు రోజులుగా బేరసారాలు కొనసాగుతున్నాయి. అందులో కొన్ని చోట్ల కొలిక్కి వచ్చి వేలం పాటల ద్వారా స్థానాలు ఏకగ్రీవం చేసేందుకు సిద్ధం కాగా, మరికొన్ని చోట్ల చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కొండమల్లేపల్లి మండల పరిధిలోని జానిగానితండా, దేవరోనితండా గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవం చేసేందుకు మూడు నాలుగు రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే జాని తండాలో రూ.8లక్షలు, దేవరోనితండాలో రూ.17 లక్షలకు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం చేసేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. అదే మండలం చింతకుంట్ల గ్రామంలో కూడా సర్పంచ్ సర్పంచ్ ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
తిరుమలగిరిసాగర్‌లో
రెండు పంచాయతీల ఏకగ్రీవానికి ఓకే
తిరుమలగిరి సాగర్ మండలంలో ఇప్పటికే రెండు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం చేసేందుకు అన్నీ ఓకే అయ్యాయి. మండలంలోని గర్కనేనితండాలో వేలం పాటలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సపావత్ బాలు రూ.30 లక్షలకు వేలం పాట పాడటంతో అతన్ని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు అందరూ సమ్మతించినట్లు తెలిసింది. ఇక్కడ 1,500 మంది ఓట్లుండగా ఓటుకు రూ.వెయ్యి చొప్పున రూ.15 లక్షలను పంపిణీ చేయాలని, మిగిలిన రూ.15 లక్షలు తండాలో బొడ్రాయి పండుగ కోసం వినియోగించుకోవాలని తీర్మానించినట్లు సమాచారం. అలాగే కిచ్యాతండా పంచాయతీలో నిర్వహించిన వేలంలో తండాకు చెందిన వంకుడవత్ లాలుకు రూ.12 లక్షలకు ఓకే అయినట్లు తెలిసింది. అదే మండలంలోని తునికినూతల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి వేలం పాట నిర్వహించగా, జటావత్ బొడ్డా రూ.20 లక్షలు పాట పాడినట్లు గ్రామస్తుల్లో చర్చ జరుగుతోంది.
త్రిపురారంలో నేడో రేపో..
త్రిపురారం మండలంలో అల్వలపాడు, బృందావనపురం గ్రామాలు ఏకగ్రీవం కావడానికి అవకాశం ఉంది. ఆ గ్రామాల్లో ఒక్కరుచొప్పునే నామినేషన్ వేయగా, రెండో రోజు కూడా ఆ గ్రామాలకు సంబంధించిన వారెవరూ నామినేషన్ వేయలేదు. గ్రామాలకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల మొత్తం గ్రామస్తుల సమక్షంలో ప్రకటిస్తూ అబివృద్ధి చేసుకోవాలని ఆ రెండు గ్రామాల ప్రజలు ఒప్పుకున్నట్లు తెలిసింది. ప్రజలంతా ఓకే అనుకొని ఒకరితోనే నామినేషన్ వేయించినట్లు సమాచారం. రూప్లాతండాలో ఒక సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ వేశారు. అక్కడ కూడా మరొకరు వేయకుండా ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
ఫ ఒకవైపు వేలం పాటలు.
మరోవైపు ఏకగ్రీవాలు
ఫ రేపు మూడో విడత ఎన్నికలకు
నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ
ఫ నేటితో ముగియనున్న రెండో విడత నామినేషన్ల ప్రక్రియ
ఇప్పటికే నల్లగొండ, చండూరు డివిజన్లలో మొదటి విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా, రెండో విడత మిర్యాలగూడ డివిజన్‌లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై మంగళవారంతో ముగియనుంది. మూడో విడత దేవరకొండ డివిజన్‌కు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 3న ఎన్నికల అధికారి విడుదల చేయనున్నారు. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.


