పంచాయతీ ఎన్నికల్లో మొదటిసారి నోటా | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ ఎన్నికల్లో మొదటిసారి నోటా

Nov 28 2025 11:45 AM | Updated on Nov 28 2025 11:45 AM

పంచాయ

పంచాయతీ ఎన్నికల్లో మొదటిసారి నోటా

నూతన పంచాయతీల్లో

కొత్తగా రిజర్వేషన్లు..

ఫిర్యాదులకు టోల్‌ ఫ్రీ నెంబర్‌

‘సాక్షి’తో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటిసారిగా నోటాను ప్రవేశ పెట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే నోటాకు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లోనే నోటా ఉండగా, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాను ఎన్నికల కమిషన్‌ ప్రవేశ పెట్టిందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై గురువారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. కలెక్టర్‌ ఇలా త్రిపాఠి వెల్లడించిన అంశాలు ఆమె మాటల్లోనే..

ఎన్నికల ఖర్చులపై డిక్లరేషన్‌

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు.. నిబంధనలకు లోబడి ఖర్చు చేస్తామని ముందుగానే ఎన్నికల అధికారులకు అఫిడవిట్‌ ఇవ్వాలి. ఈసారి కొత్తగా ఈ విధానాన్ని ఎన్నికల కమిషన్‌ తీసుకువచ్చింది. ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి, పరిమితికి మించి ఖర్చు చేస్తే దాన్ని ఛాలెంజ్‌ చేస్తూ, వారిని పదవి నుంచి డిస్‌క్వాలిపై చేసే అవకాశం ఉంటుంది. అన్ని నామినేషన్‌ కేంద్రాల్లో హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేశాం. అభ్యర్థులంతా ఒక రోజు ముందుగానే వచ్చి అవసరమైతే నామినేషన్‌ పత్రాలను హెల్ప్‌డెస్క్‌ల వద్ద నింపుకోవచ్చు. డమ్మీ నామినేషన్‌ వేయడం మంచిది. ఈ విషయంలో మా అధికారులు, సిబ్బంది అభ్యర్థులకు సహకరిస్తారు. ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలను సమర్పించవచ్చు. రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను సోషల్‌ మీడియాలో వచ్చిన వాటిని చూసి మోసపోవద్దు. నామినేషన్‌ కేంద్రాల్లో ప్రచురించిన ఎన్నికల సంఘం ఇచ్చిన గెజిట్‌లోని వివరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి.

నామినేషన్‌ పత్రాల్లో ఖాళీలు ఉంచొద్దు

పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్‌ పత్రాల్లో ఎక్కడ కూడా ఖాళీగా వదిలేయవద్దు. అందులోని అంశాలు ఏవైనా తమకు వర్తించకపోతే నాట్‌ అప్లికబుల్‌ (ఎన్‌ఏ) లేదా నిల్‌ అని రాయాలి. ఖాళీగా వదిలేస్తే మాత్రం అభ్యర్థిత్వం తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. నామినేషన్‌ పత్రాలను రాయడంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. నామినేషన్‌ కేంద్రాల్లోని అధికారులు, సిబ్బంది సహకారం తీసుకోవచ్చు.

5 గంటల్లోపు వచ్చిన వారికే అనుమతి

ప్రతి రోజు ఉదయం 10.30 సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 5 గంటల సమయం అనేది రిటర్నింగ్‌ అధికారి గదిలో ఉన్న గడియారం సూచించే సమయాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. ఆ సమయంలోగా ఎంత మంది నామినేషన్‌ పత్రాలు సమర్పించడానికి వచ్చినా వారిని అనుమతిస్తారు. నామినేషన్‌ పత్రాలకు సంబంధించిన దరఖాస్తు రుసుమును నగదు రూపేన చెల్లించాలి. అన్‌ రిజర్వుడు స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పోటీ చేస్తే వారి కేటగిరి ప్రకారమే నామినేషన్‌ రుసుం చెల్లించాల్సి ఉంటుంది తప్ప అన్‌రిజర్వుడ్‌ రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు.

కుల ధ్రువీకరణ పత్రం

స్క్రూటినీ రోజు తప్పనిసరి

ఎన్నికల్లో పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కుల ఽఽధ్రువీకరణ పత్రం తప్పనిసరి. అయితే నామినేషన్‌ వేసే సమయానికి ఆన్‌లైన్‌ కుల ధ్రువీకరణ పత్రం లేని వారు డిప్యూటీ తహసిల్దార్‌ నుంచి రాతపూర్వకంగా కులం ధ్రువీకరిస్తూ లెటర్‌ తీసుకొచ్చినా సరిపోతుంది. స్క్రూటినీ రోజు మాత్రం తప్పనిసరిగా కుల ధ్రువీకరణ పత్రం అందజేయాలి.

టీ పోల్‌లో వివరాలు అప్‌లోడ్‌

ఎన్నికల సంఘం టీ పోల్‌ యాప్‌ను తీసుకొచ్చింది. అందులో గ్రామ పంచాయతీల రిజర్వేషన్లను అప్‌లోడ్‌ చేశాం. పోలింగ్‌ రోజు పోలింగ్‌ శాతాన్ని అప్‌లోడ్‌ చేస్తాం. ఎప్పటికప్పుడు ప్రజలు దాన్ని పరిశీలించుకోవచ్చు. దాని ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

పక్కాగా ఏర్పాట్లు

ఇప్పటికే అన్ని పంచాయతీలకు బ్యాలెట్‌ బాక్సులను పంపించాం. పోలింగ్‌ మెటీరియల్‌ కూడా పంపాం. మండల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల ద్వారా పోలింగ్‌ ముందు రోజు పంపిణీ చేస్తాం. పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు, సిబ్బందికి అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నాం. జిల్లాలో 900 లోపు ఓటర్లున్న గ్రామ పంచాయతీలే ఎక్కువగా ఉన్నాయి. 500 లోపు ఉన్నవి 37 మాత్రమే. తనిఖీ బృందాలు, పరిశీలన బృందాలు క్షేత్రస్థాయిలో తమ పనుల్లో నిమగ్నమయ్యాయి.

జిల్లాలో 25 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. వాటిల్లో కొత్తగా ప్రారంభం నుంచి రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం. నకిరేకల్‌ మండలంలోని 7 గ్రామాల్లోనూ అంతే. రిజర్వేషన్ల ప్రక్రియ అంతా రాజకీయ పార్టీల సమక్షంలో వీడియో చిత్రీకరించి నిర్ణయించాం. దేవరకొండ డివిజన్‌లో కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ భవనాలు లేవు. అలాంటి చోట్ల కంటైయినర్‌ పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. వాటికి జియో ట్యాగింగ్‌ ఇస్తాం. రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.

ఫ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుపై ముందుగానే డిక్లరేషన్‌

ఫ నామినేషన్‌ అఫిడవిట్‌లో ఖాళీలు లేకుండా నింపాలి

ఫ ధ్రువీకరణ పత్రాలను సరిచూసుకోవాలి

ఫ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం

1800 425 1442

ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు, ఫిర్యాదులు, ఇతర సమస్యలున్నా ఉన్నా కలెక్టర్‌ కార్యాలయంలో టోల్‌ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేశాం. 1800 425 1442 నెంబరుకు ఫోన్‌ చేసి చెప్పవచ్చు. నాయకులు ప్రచార ర్యాలీలు, బహిరంగ సభలకు 48 గంటల ముందుగానే ఆర్డీవోల నుంచి అనుమతి పొందాలి.

పంచాయతీ ఎన్నికల్లో మొదటిసారి నోటా1
1/2

పంచాయతీ ఎన్నికల్లో మొదటిసారి నోటా

పంచాయతీ ఎన్నికల్లో మొదటిసారి నోటా2
2/2

పంచాయతీ ఎన్నికల్లో మొదటిసారి నోటా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement