కట్టుదిట్టంగా భద్రత : ఎస్పీ పవార్
నల్లగొండ: గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల దృష్ట్యా జిల్లావ్యాప్తంగా అన్ని నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టంగా భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. నామినేషన్ ప్రక్రియ పూర్తిగా నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరిగేలా అన్ని భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ ఎన్నికల నియమావళి పాటించాలన్నారు. ఎన్నికల ప్రక్రియను భంగపరచాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలోని సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ఎవరైనా సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం, ప్రత్యర్థులపై దుష్ప్రచారం, ఉద్రిక్తతకు దారితీసే పోస్టులు పెట్టడం, ఫార్వర్డు చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థులు ఈ కింది సూచనలు పాటించాలని ఎస్పీ తెలిపారు.
సూచనలు ఇవీ..
● అభ్యర్థితోపాటు ఇద్దరు (1+2) ప్రపోజర్లు మా త్రమే నామినేషన్ కార్యాలయంలోకి అనుమతి.
● ర్యాలీలు, గుంపులు, కాన్వాయ్ పూర్తిగా నిషేధం.
● 100 మీటర్లలోపు పార్కింగ్ నిషేధం.
● అభ్యర్థి ఒక్కరి వాహనానికి మాత్రమే అనుమతి.
● నామినేషన్ సెంటర్‌లో మొబైల్ ఫోన్లు, వీడియో రికార్డింగ్ నిషేధం.
● సౌండ్ బాక్స్‌లు నామినేషన్ కేంద్రం వద్ద పూర్తిగా నిషేధం.
● ప్రచార వాహనాలు, మైక్‌సెట్ వాడాలంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలి.
● పార్టీ జెండాలు, బ్యానర్లు, మైక్‌సెట్లు నామినేషన్ కేంద్రం వద్దకు తీసుకురావొద్దు.
● డబ్బు, మద్యం, బహుమతులు నామినేషన్ కేంద్రానికి తీసుకురాకూడదు.
● అభ్యర్థులు, వారి ఫాలోవర్లు శాంతియుతంగా ప్రవర్తించాలి.
● నామినేషన్ వేసే రోజు ఎంసీసీ మార్గదర్శకాలు, బందోబస్తు నియమాలు అభ్యర్థులు, కార్యకర్తలు తప్పక పాటించాలి.


