యాసంగికి భరోసా..
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు నిండుకుండలా కళకళలాడుతోంది. దీంతో యాసంగి పంటలకు ఢోకా లేదని ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం వరి కోతలు పూర్తి కావడంతో రైతులు యాసంగి పనులు ప్రారంభించారు. ఈ ఏడాది జూన్ మాసంలోనే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో వానాకాలం పంటల సాగుకు ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేశారు. ఇప్పటికీ ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో వస్తుండగా క్రస్టు గేట్ల ద్వారా దిగువ మూసీకి నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. దాదాపు 40 టీఎంసీల నీరు దిగువకు విడుదలై కృష్ణా నదిలో కలిసింది. ప్రస్తుతం ప్రాజెక్టు 644.30 (గరిష్ఠ నీటిమట్టం 645 అడుగులు) అడుగుల నీటిమట్టంతో కళకళలాడుతోంది. ప్రాజెక్టు ద్వారా ప్రతి సంవత్సరం డిసెంబర్ రెండో వారం నుంచి యాసంగికి నీటి విడుదల ప్రారంభిస్తున్నారు. దీంతో వేసవి చివరలో పంటలకు నీటి కొరత ఉండదని పాలకులు గతంలో నిర్ణయించారు. ప్రస్తుతం నీటి విడుదల ప్రణాళికపై ఎలాంటి స్పష్టత రాలేదు. అయినా యాసంగి సాగు నీటి విడుదలకు ఎలాంటి ఢోకా ఉండదనే నమ్మకంతో రైతులు వ్యవసాయ పనులు ముమ్మరంగా చేసుకుంటున్నారు.
ఆయకట్టు ఇలా..
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 8 మండలాల్లో ఉన్న 42 గ్రామాల పరిధిలో అధికారికంగా 30 వేల ఎకరాల్లో మూసీ ఆయకట్టు విస్తరించి ఉంది. దీంతోపాటు రైతులు కాల్వలకు విద్యుత్ మోటార్లు వేసి అనధికారికంగా మరో 15 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు ప్రధాన కుడికాల్వ ద్వారా నల్లగొండ జిల్లాలో కేతేపల్లి, వేములపల్లి, మాడ్గులపల్లి, తిప్పర్తి, మిర్యాలగూడ మండలాల్లోని 14,770 ఎకరాల భూములకు సాగునీరు అందుతుంది. ఎడమ కాల్వ కింద సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల, పెన్‌పహాడ్, సూర్యాపేట మండలాల పరిధిలోని 14 గ్రామాల్లో 15,230 ఎకరాల ఆయకట్టు సాగవుతుంది.
దొడ్డు రకాల సాగు వైపే మొగ్గు
ముందుగా వానాకాలం కోతలు పూర్తి చేసుకున్న రైతులు నార్లు పోసి పదిహేను రోజులు కావొస్తుంది. కొంత ఆలస్యంగా కోతలు పూర్తి చేసిన రైతులు నార్లు పోసేందుకు మడులు సిద్ధం చేస్తున్నారు. యాసంగి సీజన్‌లో సన్నరకాలు సాగు చేస్తే దిగుబడి తక్కువ వస్తుందనే భావనలో ఉన్న రైతులు ఎక్కువగా దొడ్డు రకాల సాగు వైపే మొగ్గు చూపుతున్నారు.
ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీటి లభ్యత, నిల్వల వివరాల నివేదికను రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించాం. వాటి ప్రకారం ఉన్నతాధికారులు నీటి విడుదల తేదీలను నిర్ణయిస్తారు. డిసెంబర్ మొదటి వారంలో నీటి విడుదల షెడ్యూలు ప్రకటించే చేసే అవకాశముంది.
–చంద్రశేఖర్‌రెడ్డి, డీఈ, మూసీ ప్రాజెక్టు
ఫ నిండు కుండలా మూసీ ప్రాజెక్టు
ఫ ఇప్పటికే నార్లు పోసుకున్న రైతులు
ఫ ఖరారు కాని నీటి విడుదల షెడ్యూల్
యాసంగికి భరోసా..


