1న ఉమ్మడి జిల్లా స్థాయి ఖోఖో జట్ల ఎంపిక
నల్లగొండ టూటౌన్ : ఉమ్మడి జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్ అండర్–19 బాలబాలికల ఖోఖో జట్ల ఎంపిక పోటీలు డిసెంబర్ ఒకటో తేదీన కనగల్ మోడల్ స్కూల్‌లో నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్ అండర్–19 సెక్రటరీ కుంభం నర్సిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు బోనఫైడ్ సర్టిఫికెట్, పదో తరగతి మెమోతో డిసెంబర్ ఒకటో తేదీ ఉదయం 9 గంటలకు పాఠశాలలో హాజరుకావాలని కోరారు. ఇతర వివరాలకు విజయ్ 9949337099 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.
ఎన్నికలు సజావుగా
సాగేలా పనిచేయాలి
నల్లగొండ: ప్రతి ఉద్యోగి ఎన్నికలు సజావుగా సాగేలా పనిచేయాలని స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా ప్రజాపరిషత్, పంచాయతీరాజ్ ఉద్యోగులకు గ్రామపంచాయతీ ఎన్నికల నియమావళిపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బ్యాలెట్ పేపర్లను జాగ్రత్తగా తీసుకెళ్లాలని, పోలింగ్ కేంద్రాల నుంచి కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే వాహనాలను సమకూర్చుకోవాలని సూచించారు. సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, ఎన్నికల వ్యయ అబ్జర్వర్ వెంకటాద్రి, పాల్గొన్నారు.
మధ్యవర్తిత్వంతో కేసుల సత్వర పరిష్కారం
రామగిరి(నల్లగొండ): మధ్యవర్తిత్వంలో కేసులు సత్వర పరిష్కారం అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయవాదులకు మధ్యవర్తిత్వంపై 5 రోజులపాటు నిర్వహించిన శిక్షణ శిబిరం ముగింపు సమావేశం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాల్గొని మాట్లాడుతూ శిక్షణ పొందిన న్యాయవాదులు మధ్యవర్తిత్వం వహించి కక్షిదారులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న న్యాయవాదులకు సర్టిఫికెట్లు అందజేశారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సెక్రటరీ పురుషోత్తమరావు, మొదటి అదనపు జిల్లా జడ్జి సంపూర్ణ ఆనంద్, మహిళా కోర్టు జడ్జి కవిత, ఎంజీయూ వీసీ అల్తాఫ్ హుస్సేన్, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కట్టా అనంతరెడ్డి, నగేష్, చీఫ్ లీగల్ ఎయిడ్ సభ్యుడు భీమార్జున్‌రెడ్డి పాల్గొన్నారు.
1న ఉమ్మడి జిల్లా స్థాయి ఖోఖో జట్ల ఎంపిక


