
కాలం చెల్లిన మందులిచ్చారని పీహెచ్‌సీ ఎదుట నిరసన
తుర్కపల్లి: కాలం చెల్లిన మందులు ఇచ్చారంటూ ఓ రోగి శనివారం సాయంత్రం తుర్కపల్లి పీహెచ్‌సీ ఎదుట నిరసనకు దిగాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి చెందిన తొలిచుక్క అంజయ్య కాలుకు మూడు రోజుల క్రితం ఇనుప చువ్వ గుచ్చుకోగా.. చికిత్స నిమిత్తం స్థానిక పీహెచ్‌సీకి వచ్చాడు. పీహెచ్‌సీ డాక్టర్ రుచిరారెడ్డి సూచన మేరకు స్టాఫ్ నర్సు రజిత అంజయ్యకు ఇంజెక్షన్‌తో పాటు మందులు ఇచ్చింది. ఇంటికి వెళ్లిన అనంతరం అంజయ్య కాలుకు ఇన్‌ఫెక్షన్ కావడం, తీవ్ర నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు మందులను చూడగా కాలం చెల్లినట్లు గుర్తించారు. దీంతో అంజయ్య శనివారం సాయంత్రం పీహెచ్‌సీ ఎదుట ఆందోళన చేపట్టాడు. ఈ ఘటనపై డాక్టర్ రుచిరారెడ్డి స్పందిస్తూ.. స్టాఫ్ నర్సు రజిత, ఫార్మసిస్ట్ మహేశ్వరిపై విచారణ జరిగి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై డీఎంహెచ్‌ఓకు నివేదిక అందజేస్తామని ఆమె తెలిపారు.