ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని ఆత్మహత్య

Oct 19 2025 7:09 AM | Updated on Oct 19 2025 7:09 AM

ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని ఆత్మహత్య

చౌటుప్పల్‌: ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం చౌటుప్పల్‌ పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్‌ పట్టణంలోని రత్నానగర్‌కాలనీలో నివాసముంటున్న పల్లె స్వామిగౌడ్‌(49)కు భార్య సుశీల, కుమార్తె అఖిల ఉన్నారు. అతడు చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధి లింగోజిగూడెం గ్రామంలోని ఓ పెట్రోల్‌ బంక్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య లక్కారం శివారులోని ఓ పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తోంది. ఇటీవల వారి కుమార్తె వివాహం జరిగింది. స్వామిగౌడ్‌ పెట్రోల్‌ బంక్‌లో పనిచేయడంతో పాటు ఫైనాన్స్‌ వ్యాపారం కూడా నిర్వహిస్తుంటాడు. ప్రతి రోజు సాయంత్రం 6గంటల సమయంలో తన భార్య డ్యూటీ ముగించుకొని ఇంటికి వస్తుంది. ఈ క్రమంలో బస్టాండ్‌ వద్దకు వెళ్లి ఆమెను బైక్‌పై ఇంటికి తీసుకొస్తుంటాడు. శనివారం సాయంత్రం కూడా స్వామిగౌడ్‌కు అతడి భార్య ఫోన్‌ చేయగా.. అతడు లిఫ్ట్‌ చేయలేదు. దీంతో ఆమె నడుచుకుంటూనే ఇంటికి చేరుకుంది. తలుపులు దగ్గరకు వేసి ఉండడంతో నెట్టుకొని లోపలికి వెళ్లగా.. స్వామిగౌడ్‌ ఉరికి వేలాడుతూ కనిపించాడు. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

18 పేజీల సూసైడ్‌ నోట్‌ స్వాధీనం

ఇంట్లో స్వామిగౌడ్‌ రాసిన 18 పేజీల సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన బంధువులకు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి, సొంత అల్లుడికి, స్థానికంగా తనతో అనుబంధం కలిగిన 18మంది రాజకీయ నాయకులకు, క్లాస్‌మేట్స్‌కు వేర్వేరుగా స్వామిగౌడ్‌ సూసైడ్‌ నోట్‌ రాశాడు. అందులో ‘నాకు అప్పులు అయ్యాయి. ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. ఈ అప్పులతో ఇబ్బంది పడుతున్న విషయం ఇంట్లో కూడా తెలియదు. తెలిస్తే ముందుగా నా భార్య చనిపోతుంది. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు సొంత ఇల్లు కూడా లేదు. నాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు. నా కుటుంబాన్ని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఆదుకోవాలి. మనం ఇన్ని సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్నాం, కావున ఇకపై మీరంతా నా కుటుంబానికి అండగా నిలవాలి’ అని క్లాస్‌మేట్స్‌కు విజ్ఞప్తి చేశాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చౌటుప్పల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement