
అధిక వడ్డీ దందా.. గుండెపోటుతో యువకుడి మృతి
చందంపేట: అధిక వడ్డీ దందా ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. వివరాలు.. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన పలువురు అధిక వడ్డీ చెల్లిస్తామంటూ నల్ల గొండ జిల్లా చందంపేట మండలం పోల్య నాయక్‌తండాలో కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నారు. అనుకున్న ప్రకారమే మొదట్లో అధిక వడ్డీ ఇస్తుండడంతో మరికొందరు వారికి డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా గ్రామానికి చెందిన సుమారు పదిహేను మంది నుంచి రూ.2కోట్ల వరకు వసూలు చేశారు. అదే గ్రామానికి చెందిన ఇస్లావత్ నాత్య కుమారుడు ఇస్లావత్ నరేష్(30) కుటుంబంతో పాటు హైదరాబాద్‌లో నివాసముంటూ శుభకార్యాలలో వంటలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నరేష్ కూడా రూ.9లక్షల వరకు అప్పు తెచ్చి వారికి వడ్డీకి ఇచ్చాడు. మొదట్లో అనుకున్న మేరకు అధిక వడ్డీ చేతికి అందగా.. ఆ ఆతర్వాత సరైన స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చిన నరేష్ వారిని గట్టిగా నిలదీశాడు. దీంతో రేపు, మాపు అంటూ కాలం వెళ్లదీస్తూ వస్తున్నారు. దీంతో నరేష్‌కు అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో తీవ్ర మనోవేదనకు గురై శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు.