
యాదగిరీశుడిని దర్శించుకున్న పీవీ సింధు
యాదగిరిగుట్ట రూరల్: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్ పతక విజేత పీవీ సింధు శనివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. ప్రధానాలయంలోని స్వయంభువులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి నిత్యకల్యాణంలో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు వారికి వేదాశీర్వచనం చేశారు. స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని పీవీ సింధుకు ఆలయ అధికారులు అందజేశారు.
సాగర్‌ను సందర్శించిన ఏపీ గవర్నర్
నాగార్జునసాగర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శనివారం నాగార్జునసాగర్‌కు వచ్చారు. ఆయనకు విజయవిహార్ అతిథిగృహం వద్ద నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అధికారులు స్వాగతం పలికారు. మధ్యాహ్నం భోజనం అనంతరం ప్రత్యేక లాంచీలో ఆయన నాగార్జునకొండకు వెళ్లారు. అక్కడ మ్యూజియంలోగల బౌద్ధశిల్పాలు, బోధివృక్షం, అలనాటి నాగరికత విశేషాలను తెలుసుకున్నారు. సాయంత్రం విజయవిహార్ అతిథిగృహానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేశారు. ఆదివారం ఉదయం స్థానికంగా మరికొన్ని సందర్శనీయ స్థలాలకు చూస్తారు. సాయంత్ర తిరిగి అమరావతికి వెళ్లనున్నారు.
ట్రాక్టర్ ఢీకొని
ఏఎన్‌ఎం దుర్మరణం
వలిగొండ: స్కూటీపై వెళ్తున్న ఏఎన్‌ఎంను ట్రా క్టర్ ఢీకొనడంతో మృతి చెందింది. ఈ ఘటన వలిగొండ మండలం వర్కట్‌పల్లిలో శనివా రం జరిగింది. వలిగొండ మండల కేంద్రానికి చెందిన పోలేపాక(దేవరాయ) సుజాత (43) వర్కట్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్‌ఏంగా విధులు నిర్వర్తిస్తోంది. శనివారం సాయంత్రం పీహెచ్‌సీలో విధులు ముగించుకొని తన కుమారుడిని తీసుకొని స్కూటీపై ఇంటికి తిరిగి వస్తుండగా.. పీహెచ్‌సీ సమీపంలో ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుజాత తలపై నుంచి ట్రాక్టర్ టైరు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె కుమారుడికి కాలు విరిగడంతో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యుగంధర్ తెలిపారు.
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం సంప్రదాయ పూజలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా సుప్రభాత సేవ, అభిషేకం, తులసీదళాలర్చన, అష్టోత్తర పూజలు, సుదర్శన నారసింహా హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించారు. సాయంత్రం వెండి జోడు సేవను ఆలయ మాడ వీధిలో ఊరేగించారు.

యాదగిరీశుడిని దర్శించుకున్న పీవీ సింధు