
పుస్తెలతాడు చోరీకి యత్నం.. దొంగకు దేహశుద్ధి
నార్కట్‌పల్లి: పత్తి చేను వద్దకు వెళ్తున్న మహిళ మెడలోని పుస్తెలతాడును గుర్తుతెలియని యువకుడు అపహరించేందుకు యత్నించగా గ్రామస్తులు అతడిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పజెప్పారు. ఈ ఘటన శనివారం నార్కట్‌పల్లి మండలం దాసరిగూడెం గ్రామ శివారులో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దాసరిగూడెం గ్రామానికి చెందిన ఉప్పల సునీత శనివారం ఉదయం 11గంటల సమయంలో తమ పత్తి చేను వద్దకు వెళ్తోంది. అదే సమయంలో అటుగా బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని యువకుడు బైక్‌ను కొద్దిదూరంలో ఆపి సునీత వద్దకు నడుచుకుంటూ వచ్చాడు. ఇక్కడ గుంట తంగడి ఆకు దొరుకుతదా అంటూ మాటల్లో పెట్టి ఆమె మెడలోని పుస్తెలతాడు లాక్కోని పారిపోబోయాడు. సునీత అతడితో పెనుగులాడి కేకలు వేయడంతో అటుగా కారులో వెళ్తున్న వారు వచ్చి దొంగను పట్టుకున్నారు. గ్రామస్తులకు సమాచారం తెలియడంతో దొంగను చితకబాది పోలీసులకు సమాచారం ఇచ్చారు. నార్కట్‌పల్లి ఎస్‌ఐ క్రాంతికుమార్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని దొంగను అరెస్ట్ చేశారు.
పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు
దాసరిగూడెం శివారులో ఘటన